ఈడీ దాడులకు తలవంచం : కవిత

ఈడీ దాడులకు తెలంగాణ సమాజం తలవంచబోదని కేంద్రంలోని పెద్దలు గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఆమె ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, మార్చి 8 (విశ్వం న్యూస్) : ‘బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగతీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను మేం ఎండగడుతూనే ఉంటాం. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాం. కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం’ అని కవిత స్పష్టం చేశారు.
రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈనెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది అని కవిత తెలిపారు.

ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను అని కవిత పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను అని కవిత పేర్కొన్నారు.