మాజీ మంత్రి ఎర్రబెల్లి కన్నీళ్లు

మాజీ మంత్రి ఎర్రబెల్లి కన్నీళ్లు

తొర్రూర్, ఫిబ్రవరి 17 (విశ్వం న్యూస్) : తొర్రూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయనను పోలీసులు నర్సింహుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. “ఎంతో కష్టపడి పనిచేసిన గులాబీ కార్యకర్తలకు నేను ఏం సమాధానం చెప్పాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో రాజ్యాంగ విరుద్ధ చర్యలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కారని విమర్శించారు.

మరోవైపు, తొర్రూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ఎంపీ కడియం కావ్య ఎక్స్‌ అఫీషియో సభ్యురాలిగా అనర్హురాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ తమను బెదిరించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తూ, ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తొర్రూర్ రాజకీయాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *