సింగరేణి దోపిడీని ప్రశ్నించినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్

సింగరేణి దోపిడీని ప్రశ్నించినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, జూన్ 9 (విశ్వం న్యూస్):సింగరేణి కాలరీస్‌లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలను బహిర్గతం చేసినందుకే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న బాల్క సుమన్‌ను ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన దాసోజు శ్రవణ్.. సింగరేణిని సీఎం రేవంత్ రెడ్డి తన బావమరిది వ్యాపార ప్రయోజనాల కోసం “మేత ఆవు”గా మార్చేశారని విమర్శించారు. సింగరేణిలో రూ.15 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారం, ఓబీ వర్క్స్ కాంట్రాక్టులు, డీజిల్, జిలెటిన్ సరఫరాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

బాల్క సుమన్‌పై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు, హత్యాయత్నం వంటి కేసులు పెట్టినా ఆయన వెనక్కి తగ్గబోరని, ఉద్యమకారులను జైళ్లలో పెట్టి ప్రజా పోరాటాలను అణచలేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై అనుచిత భాష వాడుతున్నారని, కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోని పోలీసులు ప్రతిపక్షాలపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.

సింగరేణిలో జరిగినట్లు ఆరోపిస్తున్న అన్ని అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని, తెలంగాణ ఆస్తులను కాపాడేందుకు ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *