రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ.. మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

హైదరాబాద్, జూన్ 9 (విశ్వం న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి పోటీ చేసేందుకు ఆమె దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని స్క్రూట్నీ అనంతరం రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
ఆస్తుల వివరాలు, అలాగే తెలంగాణలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల సమాచారాన్ని అఫిడవిట్‌లో వెల్లడించలేదంటూ బీజేపీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ అభ్యంతరాలపై పరిశీలన జరిపిన అనంతరం నామినేషన్‌ను తిరస్కరించినట్లు సమాచారం.
ఈ పరిణామంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని కోర్టులో సవాలు చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో తమకు నోటీసు ఇచ్చి వివరణ కోరాల్సి ఉండేదని, అలాంటి అవకాశం ఇవ్వకుండా నామినేషన్‌ను తిరస్కరించడం సరికాదని విమర్శించారు.
అలాగే రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించిన ఆయన, ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.