
- తెలంగాణ స్వరమతడు తెలంగాణ వరమతడు
- తెలంగాణ బీజమతడు తెలంగాణ తేజమతడు
- తెలంగాణ దివ్య ధ్వజమతడు తెలంగాణ జాతిపితయతడు….
హైదరాబాద్, ఫిబ్రవరి 17, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం. దాని వెనుక ఉన్నది కేవలం రాజకీయ నిర్ణయం కాదు… అది తరతరాల ఆకాంక్ష, త్యాగాల పునాది మీద నిలిచిన మహోద్యమం. తొలి దశలో ఆరంభమై, మధ్యలో ఆగిపోయినట్లే కనిపించిన ఉద్యమం, ప్రజల హృదయాల్లో అగ్నిలా మండుతూనే కొనసాగింది. ఆ ఆకాంక్షకు మలిదశ ఉద్యమం రూపమిచ్చి, విజయం దిశగా నడిపించిన నాయకత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిది.
2001 నుంచి 2014 వరకూ సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమం ఒక ప్రజా మహోద్యమంగా మారింది. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు – సమస్త తెలంగాణ సమాజం ఒకే లక్ష్యంతో కదిలింది. “జై తెలంగాణ” నినాదం రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. “మా తెలంగాణ మాక్కావాలె” అంటూ కేసీఆర్ గారు 2009లో చేపట్టిన చావో–రేవో ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని పరాకాష్టకు చేర్చింది.

విద్యార్థుల ఆత్మార్పణలు, శ్రీకాంతాచారి ప్రాణత్యాగం ఉద్యమానికి మరింత బలం చేకూర్చాయి. ప్రజల సంకల్పానికి తలవంచక తప్పని పరిస్థితి అప్పటి ప్రభుత్వాలకు ఏర్పడింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలను కార్యరూపం దాల్చేలా చేసి, కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇది కేవలం ఒక రాష్ట్ర అవతరణ కాదు… కోట్లాది తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైన మహాక్షణం.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, పదేళ్ల పాలనలో తెలంగాణ దేశంలోనే అభివృద్ధి సాధించిన రాష్ట్రాల సరసన నిలిచింది. సాగునీరు, విద్యుత్, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతుల రంగాల్లో తెలంగాణ ఒక కొత్త దిశను చూపింది. అందుకే ప్రజలు కేసీఆర్ గారిని ఆప్యాయంగా “బాపూ” అని పిలుస్తారు. అది నాయకుడికి–ప్రజలకు మధ్య ఉన్న అవినాభావ బంధానికి ప్రతీక.
తుడిచేస్తే చెరగని, తూలనాడితే ఒరిగిపోని ధైర్యం… అదే కేసీఆర్ గారి వ్యక్తిత్వం. అది ఒక కారణజన్ముడి, మహానాయకుని జీవిత సత్యం.
బాపూ మీ జన్మదినం మీకే కాదు… మాకందరికీ ఒక పండుగ. తెలంగాణ చరిత్రలో చెరిగిపోని పర్వదినం. పిడికిలెత్తి జైకొట్టిన మహోద్యమ ప్రస్థానం, ప్రగతి బాట నడిపించిన పరిణత నేతృత్వం, సుపరిపాలనకు శుభసూచక పరిణామం… ఇవన్నీ మీ నాయకత్వానికి చిరస్థాయి సాక్ష్యాలు.
జయహో బాపూ కేసీఆర్…
శతాధికాయుష్మాన్ భవ…
— శ్రీదేవి మంత్రి
తెలంగాణ రాష్ట్ర పూర్వ అధికార భాష సంఘం అధ్యక్షురాలు