గాంధీ పార్టీలో ఉంటూ… హిట్లర్ పాలన….

  • ఆరు గ్యారెంటీల మోసం, 420 హామీల వైఫల్యంపై బహిరంగ చర్చకు సవాల్.. హిట్లర్ వ్యాఖ్యలతో సీఎం మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని దాసోజు శ్రవణ్ ఫైర్

హైదరాబాద్, జూన్ 9, (విశ్వం న్యూస్) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు, గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పాలనతో తన పాలనను పోల్చుకుంటూ చర్చకు సిద్ధమంటున్న రేవంత్ రెడ్డికి ఆ నైతిక హక్కు లేదని, నిజంగా ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సాక్షిగా ఆరు గ్యారెంటీలు, 420 ఎన్నికల హామీల అమలుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ప్రగతి ప్రణాళిక సమావేశాల పేరిట రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని, కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ తాను గొప్ప విజయాలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ సభల ద్వారా రేవంత్ రెడ్డి తన అహంకారం, దార్శనికత లేమి, పరిపాలనా వైఫల్యాలను ప్రజల ముందే బహిర్గతం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

“కేసీఆర్‌తో చర్చించే నైతికత నీకుందా?”” తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌తో చర్చించాలంటే ముందు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, యువజన డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్, రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి, రైతు హామీలు, పెన్షన్లు, మహిళలకు ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.

“గాంధీ పార్టీలో ఉంటూ హిట్లర్‌ను ఆదర్శమంటారా?”

హిట్లర్ తనకు స్ఫూర్తి అని సీఎం చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమని దాసోజు శ్రవణ్ విమర్శించారు. గాంధీ సిద్ధాంతాలను నమ్మే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ హిట్లర్‌ను ఆదర్శంగా చెప్పుకోవడం దేశ చరిత్రలోనే వినలేదన్నారు. రేవంత్ రెడ్డి పూర్తిగా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని, అధికార అహంకారం ఆయనను అంధుడిని చేసిందని మండిపడ్డారు.

“మూడేళ్లలోనే నాలుగు లక్షల కోట్ల అప్పులు”: పరిపాలనలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని శ్రవణ్ ఆరోపించారు. మూడేళ్లలోనే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. అభివృద్ధి చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు.

“హైదరాబాద్‌ను డిమాలిషన్ క్యాపిటల్‌గా మార్చారు”

కేటీఆర్ నాయకత్వంలో గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిన హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కూల్చివేతల రాజధానిగా మార్చేశారని శ్రవణ్ ఆరోపించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫాక్స్‌కాన్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలను తెలంగాణకు తీసుకొచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ వారసత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటే అధికార పార్టీలోని పెద్దల అక్రమ కట్టడాలపై కూడా చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు.

“ఫార్మాసిటీ రద్దుతో పెట్టుబడులకు దెబ్బ” ఫార్మాసిటీ వంటి భారీ పారిశ్రామిక ప్రాజెక్టులను రద్దు చేసి పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టించారని ఆరోపించారు. దావోస్, తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లలో ప్రకటించిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాల్లో ఎంత శాతం వాస్తవ రూపం దాల్చిందో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.

“తెలంగాణను కేకుల్లా మూడు ముక్కలు చేస్తున్నారు” సీఎం ప్రకటిస్తున్న “క్యూర్-ప్యూర్-రేర్” అభివృద్ధి నమూనాపై కూడా శ్రవణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణను మూడు ముక్కలుగా విభజించి అభివృద్ధి చేయాలనే ఆలోచన అవివేకమని, పరిశ్రమలు, వ్యవసాయం, సేవారంగం రాష్ట్రవ్యాప్తంగా సమతుల్యంగా అభివృద్ధి చెందాలని అన్నారు.

పెద్దమ్మ గుడి వద్దే తేల్చుకుందాం: చివరగా, తెలంగాణను కేసీఆర్ ఒక బాధ్యతగల తండ్రిలా అభివృద్ధి చేసి అప్పగిస్తే, రేవంత్ రెడ్డి మూడేళ్లలోనే దాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. అబద్ధపు ప్రచారాలు, చిల్లర రాజకీయాలు మానేసి, నిజంగా ధైర్యం ఉంటే పెద్దమ్మ గుడి సాక్షిగా ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీల అమలుపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ మరోసారి సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *