
వరంగల్, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవాలను వరంగల్ గడ్డపై ఘనంగా నిర్వహించింది. ఓరుగల్లు వీరగడ్డ ప్రజలు వేలాదిగా హాజరై సభను విజయవంతం చేశారు. సభలో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) ఎలా ఆవిర్భవించిందో, ఉద్యమం నుంచి అధికారానికి ఎదుగిన మార్గాన్ని సమగ్రంగా వివరించారు. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” భావనతోనే తెలంగాణ విముక్తి కోసం 2001లో ఉద్యమానికి శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు కేసీఆర్. గులాబీ జెండా కింద ప్రజల ఆశయాలను సమీకరించి, 14 ఏళ్ల ప్రజా ఉద్యమం ద్వారా ఢిల్లీని గజగజ వణికించిన ఘనతను బీఆర్ఎస్ సొంతం చేసుకుందని చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీలు రజతోత్సవ సభను అడ్డుకునేందుకు పలు కుట్రలు చేసినా, బీఆర్ఎస్ కార్యకర్తల ప్రళయ గర్జన ఎదిరించిందని ఆయన ధైర్యంగా తెలిపారు. “పోస్టర్లు చింపితే, వాల్ రైటింగ్స్ మలిపితే సభ ఆగదు. గీ పోలీసోల్లేనా? ఎల్కతుర్తిలో మా కార్యకర్తల గర్జన చూడండి” అంటూ కాంగ్రెస్, బీజేపీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను వివరించిన కేసీఆర్, సమైక్య పాలనలో రైతుల భయంకర గాథలను, ఫ్లోరైడ్ బాధితుల వేదనను స్మరించారు. “బోర్లు వేసీ వేసీ రైతులు నాశనమయ్యారు. గోదావరి, కృష్ణ నీళ్లు దక్కక అల్లాడారు. అప్పుడూ కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారు,” అంటూ కాంగ్రెస్‌పై ఆయన విరుచుకుపడ్డారు.
తెలంగాణ గడ్డపై సమ్మక్క సారక్కల పోరాట ధైర్యం, రాణి రుద్రమ వీరత్వం, బమ్మెరపోతన కవితామాధుర్యం ఉన్నాయని కేసీఆర్ భావోద్వేగంతో అన్నారు. తెలంగాణ అమరులకు శిరస్సు వంచి నివాళులర్పించారు. “మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం బీఆర్ఎస్‌కే ఉంది. ప్రజలు మనమీద తిరిగి నమ్మకం పెట్టుకోబోతున్నారు,” అంటూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగాంశాలు:
- • జననీ జన్మభూమిశ్చ – స్వర్గాదపి గరీయసీ
- • రామాయణంలో శ్రీరామచంద్రుడు ప్రత్యేక సందర్భంలో చెప్పిన మాట
- • కన్నతల్లినీ, మాతృభూమిని మించిన స్వర్గంలేదు
- • ఆ స్ఫూర్తితోనే 2001లో, వలసపాలన నుంచి తెలంగాణను విముక్తి చెయ్యాలని కంకణం కట్టుకున్న
- • స్వయంపాలనలో తెలంగాణ ధగధగలాడుతూ ముందుకు పోవాలని ఆకాంక్షించిన
- • గులాబీ జెండా నీడలో ఉద్యమాన్ని ఉధృతం చేసిన
- • తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన
- • గులాబీ జెండా పాలనలో అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దిన
- • ఆ గులాబీ జెండా పుట్టి నేటికి 25 సంవత్సరాలు
- • ఈ రజతోత్సవ సభను ఆపాలని కాంగ్రెసోళ్లు – బీజేపోళ్లు ఒక ప్రయత్నం కాదు
- • పోస్టర్లు చింపేసుడు, వాల్ రైటింగ్ మలిపేసుడు… గివి చేస్తే ఆగుతదా సభ
- • కనబడుతున్నదా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ కార్యకర్తల ప్రళయ గర్జన
- • గీ పోలీసోల్లేందయా.. పిచ్చి చేష్టలు చేస్తున్నరు
- • ఎందుకు బాగ దుంకులాడుతున్నరు?
- • పదేండ్ల బీఆర్ఎస్ రాజ్యం గిట్లనే నడిపించినమా?
- • ఇయాల మీ డైరీలల్ల రాసి పెట్టుకోండి
- • మల్లా బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎసే
- • మీ మీదికి ఎందుకు తెచ్చుకుంటరు ?
- • ఇవాళ వరంగల్ గడ్డ కూడా పులకిస్తున్నది
- • రాణి రుద్రమ్మ ఏలిన వీర గడ్డ – సమ్మక్క సారక్కల పోరుగడ్డ
- • బమ్మెరపోతన కవితామాధుర్యం పంచిన జీవగడ్డ
- ఈ ఓరుగల్లు గడ్డకు నమస్కరిస్తున్నా..
- • తెలంగాణ అమరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నా
- • 1969లో మూగబోయిన జై తెలంగాణ నినాదానికి తిరిగి జీవంపోసిన గులాబీ జెండాకు 25 ఏళ్లు
- • 14 ఏళ్ల ప్రజాఉద్యమంతో, ఢిల్లీని గజగజ వణికించిన మన పార్టీకి 25 ఏళ్లు
- • విధ్వంసమైన తెలంగాణను వికాసపథంలో నడిపించిన మన బీఆర్ఎస్ కు 25 ఏళ్లు
- పార్టీ ఆవిర్భావం…
- • 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం – టీఆర్ఎస్ స్థాపన – చరిత్రను మలుపుతిప్పిన మహోజ్వల ఘట్టం
- • పదవుల కోసమో, కులం కోసమో, మతం కోసమో పుట్టలేదు.. టీఆర్ఎస్
- • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది.. టీఆర్ఎస్
- • పదవీత్యాగాలతోనే ప్రస్థానం ప్రారంభించింది టీఆర్ఎస్
- • కాంగ్రెస్ ది పదవుల కోసం తెలంగాణను వదిలేసిన చరిత్ర
- • టీఆర్ఎస్ ది తెలంగాణ కోసం పదవులు వదిలేసిన చరిత్ర
- • కాంగ్రెస్ నాయకుల వలె నేను ఉద్యమాన్ని మధ్యలో వదిలేస్తే.. నన్ను రాళ్లతో కొట్టి చంపమని సవాల్ చేసిన
- • కాంగ్రెస్ ద్రోహాలతో జనం కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించిన
- సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కడగండ్లు…
- • 60 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస,
- ఎంత దు:ఖం , ఎంత వేదన, ఎంత హింస, ఎంత అణచివేత?
- • గోదావరి, కృష్ణ నీళ్లు దక్కకుండా తరలిపోతుంటే, తల్లి చనుబాలకు నోచని బిడ్డలాగా రోదించింది నా తెలంగాణ
- • అర్ధరాత్రి అపరాత్రి కరెంటు పెట్టబోయి, పాము కుట్టి, తేళ్లు కుట్టి ప్రాణాలు విడిచిన్రు నా రైతన్నలు
- • బోర్లు వేసీ వేసీ తెలంగాణ రైతుల బతుకులు నాశనమైపోయినయి
- • ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులు ఏం చేసిన్రు?
- • ఎవని స్వార్థం వాడు చూసుకున్నడు
- • పదవుల కోసం పెదవులు మూసి కన్నతల్లి తెలంగాణకు ద్రోహం చేసిన్రు
- • ఫ్లోరైడ్ నీళ్లతో బొక్కలు వంకరపోతుంటే చోద్యం చూసిన నల్లగొండ నాయకులు నేడు మంత్రులు
- • దుశర్ల సత్యనారాయణ ఎంత పోరాటం చేసిండు?
- • మునుగోడు, శివన్నగూడెం ప్రాంతాల్లో నేను నిద్రచేసిన
- • ఫ్లోరైడ్ బాధితుల బాధలను కండ్లారా చూసి ఏడ్చిన
- • చూడు చూడు నల్లాగొండా గుండె మీదా ఫ్లోరైడు బండా… అని పాటలు రాసినం..
- • ద్రోహాన్ని భరించలేక భగ్గుమన్న గుండెల్లో మొలిచిందే గులాబీ జెండా
- • అసెంబ్లీల తెలంగాణ అనే పదమే అనొద్దనే అహంకారానికి పోయిండు చంద్రబాబు
- • ఏ చంద్రబాబైతే అసెంబ్లీలో తెలంగాణ అనద్దని రూలింగ్ ఇప్పించిండో అదే చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించిన.
- తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్
- • ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు నంబర్-1 విలన్ కాంగ్రెస్
- • వద్దంటే ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్
- • 1969లో 369 మంది తెలంగాణ బిడ్డల్ని బలి తీసుకున్నది కాంగ్రెస్
- • 2001 నుంచి టిఆర్ఎస్ సృష్టించిన ప్రభంజనాన్ని చూసి, 2004 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్.
- • తెలంగాణ ఇస్తనని మాట ఇచ్చి ఎగ్గొట్టాలని చూసింది కాంగ్రెస్
- • నేను, జయశంకర్ సార్ కలిసి 36 పార్టీల దగ్గర లేఖలు తెచ్చినం
- • దానికోసం మేం ఎక్కని కొండ లేదు, మొక్కని బండలేదు
- • ఈ కాంగ్రెస్ నానుస్తుంటే కేంద్రమంత్రి పదవిని విసిరి కొట్టిన
- • చివరికి చావు నోట్లో తలపెట్టి దీక్ష చేస్తే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది
- • ఆ తర్వాత మాట మార్చి మూడేండ్లు రాచిరంపాన పెట్టింది కాంగ్రెస్
- • 1969 నుంచీ 2014 దాకా వందలాది మంది యువకులను బలిదీసుకున్న బ్రహ్మ రాక్షసి కాంగ్రెస్
- • సబ్బండ వర్ణాలను ఏకంచేసింది గులాబీ జెండా
- • రాజకీయ అనివార్యత సృష్టించింది గులాబీ జెండా
- • కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చింది గులాబీ జెండా
- • ఎలక్షన్లపుడు కాంగ్రోసోళ్లు చెప్పిన మాటలేంటియి?
- • ఓ ఇగ మామూలు వాగ్ధానాలు చేసిన్రా.. మామూలు కథనా?
- • ఒకణ్ణి మించి ఒకడు చెప్పిరి..
- • ఇక్కడోళ్లు చాలరని గాంధీల మీద గాంధీలు దిగిరి
- • ఉన్న గాంధీ, లేని గాంధీలు అందరొచ్చిరి
- • ఏం చెప్పుడది ? అర చేతుల వైకుంఠం చూపిరి
- • ఆరు సందమామలు – ఏడు సూర్యులు
- • కేసీఆర్ రైతు బంధు 10 వేలిస్తే.. మేం 15 వేలిస్తం
- • కేసీఆర్ పెన్షన్లు 2 వేలే ఇస్తున్నడు.. మేం 4 వేలిస్తం
- • ఇంట్ల ఇద్దరుంటె కేసీఆర్ ఒక్కలకే ఇస్తున్నడు
- • మేం ముసలయ్య, ముసలవ్వ – ఇద్దరికిస్తం
- • దివ్యాంగులకు 4 వేలు కాదు ఆరు వేలిస్తమన్నరు
- • ఇండ్లల్ల ఉండే ఆడోళ్లకు నెలకు మనిషికి 2500 ఇస్తం
- • లగ్గమయ్యెటోళ్లకు కేసీఆర్ లక్షనే ఇస్తుండు, మేం తులం బంగారం కలిపి ఇస్తం
- • సదువుకునే ఆడి పోరగాండ్లకు స్కూటీలిస్తమన్నరు
- • ఉరుకున్రి, ఉరుకున్ని…. బ్యాంకుల 2 లక్షల అప్పు తెచ్చుకోన్రి
- • డిసెంబర్ 9 నాడు ఒక్క పోటుతోని ఖతం అన్నరు
- • ధాన్యం కేసీఆర్ వట్టిగ మద్దతు ధరకే కొంటున్నడు
- • మేం ఎక్స్ ట్రా 500 కట్టిస్తం అన్నరు
- • సదువుకునే పోరగాండ్లకు 5 లక్షల కార్డు ఇస్తం అన్నరు
- • ఇంక ఇవిగాక 420 హామీలిచ్చిన్రు
- • పెద్ద పెద్ద బుక్కులు కొట్టిచ్చి పంచిన్రు
- • అడ్డం పొడుగు చెప్తున్నరు, యాడికెల్లి ఇస్తరు వయా అంటే..
- • జబ్బలు చరిచిరి, బొబ్బలు పెట్టిరి, తొడలు కొట్టిరి
- • మాది 120 ఏండ్ల పార్టీ.. వనరులు ఎట్ల సమీకరించుకోవాల్నో మాకు తెలిసినంత ఎవరికీ తెల్వదు
- • ఇపుడున్న ఆర్ధిక మంత్రి అయితే చేస్తం, చేస్తం, చేసి చూపిస్తం అని టీవీల చెప్పిన మాట నేనే విన్న
- • తీరా చూస్తే ఏమైంది…
- • పెద్ద మొగోడని మొల్కలు అల్క పిలిస్తే.. ఓ గదెంత పని అని వచ్చిండు, ఆయింత ఎల్కను చూసి ఎల్లెల్కల పడ్డడు
- • మొల్క అల్క మొగన్ని పిలిస్తే.. ఎల్కను చూసి ఎల్లెల్కల పడ్డడు
- • ఎక్స్ ట్రాలు ఇచ్చుడేమో గానీ, ఉన్నయి ఊశి పోయినయి
- • అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రాలు ఊడి పోయినయి
- • ఈ ఇంత పొడుగు, అంత పొడుగు గాళ్లంత ఏం చేసిన్రు?
- • ఎత్తడు, తవ్వడు, మొయ్యడు.. అని ముగ్గురు కల్సి బాయి తోడితే యాడాదిన్నరైనా తట్టెడు మట్టి తీసింది లేదు.
- • ఏమాయెరా అంటే.. రేపే మొదలు, సంక్రాంతికి అంటే, దీపావళికి అంటే, తారీఖుల మీద తారీఖులు
- • కనిపించిన దేవుళ్ల మీదల్లా ఒట్లు
- • మల్లా వాళ్లే పెద్దగ నోర్లు పెట్టుకొని మాట్లాడుతరు
- • గట్లెట్లా అని సోషల్ మీడియాల అడినోళ్లపై కేసులు పెడ్తున్నరు
- • ఎంత పచ్చి మోసం… ఎంత దగా..
- • బీఆర్ఎస్ ఉన్నపుడు ఎట్లుండె?
- • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచినం
- • 90 వేల కోట్ల కాడ మొదలు పెట్టిన బడ్జెట్ ను 3 లక్షల కోట్ల దాకా తీసుక పోయినం
- • తలసరి ఆదాయం లక్ష రూపాయలుంటే, మూడున్నర లక్షలకు పెంచినం
- • రాష్ట్ర స్థూల ఆదాయం జీ.ఎస్.డి.పి.ని దేశంలనే నెంబర్ 1 స్థాయికి తీసుక పోయినం
- • దేశంలనే తెలంగాణను నంబర్ 1 స్థాయిల నిలబెట్టినం
- • ఒకటంటే ఒక్క యాడాదిల నాశనం పట్టిచ్చిన్రు కదా…
- • కరోనా వస్తె కూడా రాష్ట్ర ఆదాయం తగ్గక పాయె, కాంగ్రెస్ రాంగనే తగ్గిపాయె
- • కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకానికి 15 – 20 వేల కోట్లు పెరగాల్సిన ఆదాయం పెరగలేదు, ఉల్టా తగ్గిపోయింది.
- • అంటే ఈ యాడాదిన్నరలో 30 వేల కోట్ల గాటా వచ్చింది
- • తెలివి తక్కువ పనులన్నీ చేసి ఎత్కులాడితే, పత్కులాడితే రాజ్యం నడుస్తదా..
- • ఏం జేదామంటే, ఏం జేదామని కాళ్లు, చెయ్యిలు పిసుక్కున్నరు
- • భూములు అమ్ముకుందామని ఉపాయం జేసిన్రు
- • ఏ ప్రభుత్వమైనా అవసరమైతే భూములు అమ్ముతది
- • కానీ, ఏ భూమి అమ్మాలెనో విచక్షణ ఉండాలె కదా ?
- • యూనివర్సిటీల భూములు అమ్ముతరా ఎవడన్నా?
- • నేను కాదు, ఎట్లమ్ముతర్రా అని సుప్రీంకోర్టే కట్టె పట్టుకొనె
- • ఇగో గాడికి తేలింది.. ఈ సిపాయిల వ్యవహారం
- • అన్నా.. ఒక్కటి ఆలోచన చేయున్రి
- • నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ భూముల ధరలు ఎట్లుండెనే..?
- • ఇయాల ఆపతికి అమ్ముదామంటే కొనెటోడు దిక్కున్నడా?
- • అప్పుడెట్లుండె.. నేను యాదగిరి గుట్ట ఒక్క ట్రిప్ పోయి వస్తే ధర 10 లక్షలు పెరిగేది.
- • అప్పుడు కొందామని తిరిగెటోళ్లు ఎక్కువుండిరి, అమ్మెటోళ్లు తక్కువుండిరి.
- • ఎవరన్నా రోడ్డు పక్కన భూమి ఉన్నోళ్లకైతే నేను 5 కోట్ల శ్రీమంతుణ్ణి అనే దర్జా ఉండేది
- • ఇవాళ ఎవడెత్తుక పోయిండు ఆ దర్జా
- • కాంగ్రెస్ కాకెత్తుక పోయిందా
- • రాజ్యం నడప చాతగాక ఎల్లెంకల పడి నామీద ఏడుస్తరు
- • ఎదురు మాట్లాడినోన్ని పోలీసులకు పట్టిచ్చుడు, కేసులు పెట్టిచ్చుడు
- • గింత దిక్కుమాలిన తనమా.. ఇదేం దిక్కుమాలిన దందా..
- • మేం ఉండంగ మంచిగనే చేస్తిమి, 24 గంటల కరెంటు నడువ లేదా?
- • నడింట్ల కూసొని పొలం పారిచ్చుకోలేదా?
- • తెల్లందాక పొలం పోవుడు తప్పలేదా?
- • ఇయాల గది కూడా ఇయ్యస్త లేదు
- • కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యోలె మిషన్ భగీరథ – ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లిచ్చినం
- • వీళ్లకు గది కూడా నడప చాతనైత లేదా?
- • బోనస్ బోగసే అయిపాయె
- • కనీసం వడ్లు కొన చాతనైత లేదా?
- • దిక్కులేక రైతులు దళారీల పాలవుతున్నరు, అడ్డికి పావుసేరు అమ్ముకుంటున్నరు
- • మిర్యాలగూడ కాడ రైతులు ధాన్యం తీస్కపోతే మిల్లర్లు కొట్టిన్రు
- • వార్తలొచ్చినయి – ఇదేం అన్యాయం
- • అప్పుడు ఎండల్ల మత్తడి దుంకిన చెరువు ఇపుడెందుకు బందైంది?
- • భూగర్భ జలాలు పడిపోయినయి
- • వానలు పడలేదా, వానలు మంచిగనే పడ్డయి
- • గౌరెల్లి ప్రాజెక్టు 90శాతం పూర్తి చేసినం – గా 10 శాతం పూర్తి చేయొస్త లేదా?
- • ఏనుగు ఎల్లింది.. తోక చిక్కింది.. ఎక్కడిదక్కడనే ఎందుకుంది
- • 90శాతం పూర్తయిన పాలమూరు ఎత్తిపోతలను ఎందుకు పండబెడుతున్నరు?
- • ఎందుకు రైతులను ఏడిపిస్తున్నరు?
- • మాకు నీళ్లు కావాలె అని ఆడబిడ్డలు రోడ్డు మీద ధర్నాలెందుకు చేస్తున్నరు?
- • చిన్న ముచ్చట…
- • కేసీఆర్ కిట్ ఎందుకు బందు పెట్టిన్రు?
- • దానికేమైనా లక్షల కోట్లు ఖర్చయితయా..
- • కోటీశ్వరుల కోసం పెట్టినమా, పేదల కోసమే కదా
- • ఇగ ఈ పొంకనాల పోశెట్టి గవర్నమెంటు అన్నిట్ల ఫెయిల్
- • సంక్షేమంలో ఫెయిల్
- • మంచి నీళ్లలో ఫెయిల్ – సాగునీళ్లలో ఫెయిల్
- • కరెంటు సరఫరాలో ఫెయిల్
- • రైతుబంధులో ఫెయిల్
- • విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఫెయిల్
- • ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్
- • పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్
- • రియల్ ఎస్టేట్ లో ఫెయిల్
- • మరి దేంట్లో పాస్ ?
- • అడ్డం పొడుగు ఒర్రుట్ల పాస్
- • ఇష్టం వచ్చినట్లు తిట్టుట్ల పాస్
- • బిల్లుకు పోతె కమీషన్లు గుంజుట్ల పాస్
- • ఇది నేనంట లేను, ఆర్ధిక మంత్రి చాంబర్లనే 250 మంది కాంట్రాక్టర్లు ధర్నా చేసిన్రు
- • మాజీ సర్పంచులు పనులు చేసినం బిల్లులివ్వమంటే వాళ్లను అరిగోస పెడుతున్నరు
- ఇది బుల్డోజర్ గవర్నమెంట్
- • ఎవడన్నా ఇల్లు నిలబెట్టాలె గనీ, కూలగొడ్తరా?
- • మేమేమో బస్తీల పేదలు గుడిసెలేసుకుంటే పట్టాలిచ్చినం
- • వీళ్లేమో బుల్డోజర్లు పెట్టి ఇండ్లు కూలగొడుతున్నరు
- • హైదరాబాదుల ఒక తమ్ముడు ఆయన ఇల్లు కూలగొట్టినరేమో కేసీఆర్ అన్నా.. ఎక్కడున్నవు..? నువ్వు రావాలె అని మాట్లాడుతున్నడు
- • అప్పుడు నేను కాలికి బలపం కట్టుకొని చిలకకు చెప్పినట్లు చెప్పిన
- • కాంగ్రెస్ మాటలు పట్టుకుంటే ఏమైతదని.. ఏమైతదీ?
- • తీర్థం పోదాం తిమ్మక్కా అంటే.. నువ్వు గుల్లె, నేను సల్లె అన్నట్టయితది.
- • గాడుదులకు గడ్డేసి, బర్రెల పాలు పిసికితే ఎట్లా
- • కేసీఆర్ అన్నా.. ఏం జెయ్యాలె అంటివి
- • కత్తి వాళ్లకు ఇస్తివి, యుద్ధం నన్ను చెయ్యమంటివి..
- • అయితే, ఈ మోసకారి కాంగ్రెసోళ్లు ఆగం చేస్తే మనం ఆగమైతమా.. ఇంట్ల కూసుంటమా?
- • కొట్లాడుదాం, నిలదీద్దాం, పోరాడుదాం
- • మీ వెంట కేసీఆర్ ఉంటడు, బీఆర్ఎస్ ఉంటది, గులాబీ జెండా ఉంటది
- • ఇంక కూడా ఆగం చేస్తరు వీళ్లు
- • గీ ముచ్చట్లు అసెంబ్లీల అడిగితేనే.. సమాధానం చెప్తలేరు
- • కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా.. అంటరు
- • గీ కాయ కొరుకుడు ముచ్చట్లు ఇనెటందుకు రావాల్నా?
- • మా ఎమ్మెల్యేలు అడిగితేనే సమాధానం చెప్పే సత్తా లేదు