పిల్లలతో కలిసి 76వ గణతంత్ర
వేడుకల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్

జమ్మికుంట, జనవరి 26 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ కట్టుబాటును వ్యక్తం చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్, ఆదివారం జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి గ్రామంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోఠి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేసి, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఏదైనా ఒక సబ్జెక్టును ఆసక్తిగా ఎంచుకొని ఆ రంగంలో ముందుకు వెళ్లాలని సూచించారు. తల్లి, తండ్రి, గురువులను దైవంగా భావించి విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్రీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన విషయం సంతోషకరమని, అదే స్థాయిని మరింత పెంచి దేశ స్థాయికి చేరుకోవాలని ఆయన అభిలాషను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.