ప్రజలే న్యాయ నిర్ణేతలు

కేసీఆర్ దోపిడీ పాలన ఆపగలిగే శక్తి మీకే ఉంది
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్, జనవరి 6 (విశ్వం న్యూస్) : ఈటల రాజేందర్ మాట్లాడుతూ 119 నియోజకవర్గాల్లో బిజెపి ఇచ్చిన బాధ్యతల్లో భాగంగా నాకు “వరంగల్ తూర్పు” నియోజకవర్గం అప్పజెప్పారు. మూడు రోజులపాటు మీతో పాటుగా ఉంటాను. ఈ నియోజకవర్గంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీని తీసుకుని వెళ్లే పనిమీద వచ్చాను. నరేంద్ర మోడీ గారు మనందరి ఆత్మగౌరవం నిలిపే విధంగా భారత ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారం చలాయిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ గారిని నమ్మి రెండుసార్లు ఓటు వేశాము. రెండవసారి ఓటు వేసిన తర్వాత కెసిఆర్ కి కళ్ళు నెత్తికి ఎక్కాయి. ప్రజలను మర్చిపోయి చక్రవర్తిలాగా, రాజులాగా పరిపాలిస్తున్నారు. చెప్పే మాటలకు చేసే పనికి పొంతన లేదు అవన్నీ మీ గుండెల్లో ఉన్నాయి.ఇదే వరంగల్ జిల్లాలో తిరిగిన కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం తెలంగాణకు గుండెకాయలాంటిది అన్నారు. గుడిసెల్లో ఉన్నవారు, ప్లాస్టిక్ సీట్ల కింద బతికేవారు, మురికి కాలువల వెంట కిరాయికి ఉండేవాళ్లు, పల్లెల్లో ఉపాధి లేక పట్నానికి వచ్చి రెక్కాడితే గాని డొక్కాడని పేదలు అందరికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని కేసీఆర్ చెప్పారు. ఆ మాటలు అమలు అయ్యాయా లేదా గుర్తు చేసుకోండి అని వరంగల్ ప్రజానీకానికి మనవి చేస్తున్నాను.
చిరు వ్యాపారుల మా కష్టాలు మా పిల్లలకు రావద్దు వారు గొప్పగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలి అని కోరుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయని ఆశించిన ఆశ ఆశాభంగం అయింది.
లక్షలలో ఉద్యోగాలు నింపుతున్నమని రోజు పేపర్లలో నోటిఫికేషన్లు వస్తున్నాయి. కానీ పేపర్ లీక్ అయిందని నోటిఫికేషన్లు రద్దు చేస్తున్నారు. ఉద్యోగాలు రావడం లేదని మన కళ్ళముందే పెళ్లిళ్లు కాక, వయసు మీద పడిందని, అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక చనిపోతున్నానని క్షమించమని ఉత్తరాలు రాస్తున్నారు. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంతవరకు 3116 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. నాలుగున్నర ఏళ్ళు గడిచిపోయాయి ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు.
ఒకవైపు ఈ రాష్ట్రంలో సంపదకు డబ్బులకు కొదవలేదు.. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అంటారు. కానీ ఇచ్చిన మాట మాత్రం నిలుపుకోవడం లేదు. మహిళా గ్రూపులలో ఉన్న మహిళలకు ఎన్నికల ముందు 2018 ఎన్నికల ఆరు నెలల ముందు.. ఆడబిడ్డలు అలుగుతారని, ఆడబిడ్డల ఆశీర్వాదం దొరకదని వడ్డీ లేని రుణాల డబ్బు జమ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణాల కింద మహిళలకు ఇవ్వలేదు. బ్యాంకులలో రుణం రాదేమో అనే భయంతో వాళ్ళ సొంత డబ్బులు బ్యాంకులకు వడ్డీ కట్టి ప్రభుత్వం ఇవ్వకపోతుందా అని ఎదురుచూస్తున్నరు.. ఆ డబ్బు ₹4,200 కోట్ల రూపాయలు తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ బాకీ పడ్డారు.
వరంగల్ కి వచ్చి పోయినా, కరీంనగర్ కి వచ్చినా.. జగిత్యాలకి పోయిన కెసిఆర్ ఒకటే మాట చెబుతున్నారు.. నేను చెప్పే మాటలు తెలంగాణ ఆడబిడ్డల్లారా అలకించండి అని.. కెసిఆర్ గారు మాట్లాడిన మాటలు ఆలోచించమని నేను కూడా కోరుతున్నాను. తెలంగాణ నెంబర్ వన్ అని చెప్తారు.. దేనిలో నెంబర్ వన్. దౌర్జన్యాల్లో నెంబర్ వన్..
ప్రజలను కలుసుకోకుండా ఉండటంలో నెంబర్ వన్.. ప్రభుత్వపరమైన ఆస్తులను ఆక్రమించుకోవడంలో నెంబర్ వన్.. దళితులకు ఏనాడో ఇచ్చిన భూములను గుంజుకోవడంలో నెంబర్ వన్.. ధరణి అని పెట్టి తన భూములు ఉంటాయో పోతాయో బెంగ పడేలా చేయడంలో నెంబర్ వన్.. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడపడితే అక్కడే బ్రాందీ షాపులకు అనుమతులు ఇచ్చారు. స్కూళ్ల పక్కన, గుళ్ళ పక్కన పర్మిషన్ ఇచ్చారు. మహిళలు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న కూడా బ్రాందీ షాపులు ఆగలేదు. చివరికి రెండు వందలమంది ఒకటి చొప్పున బెల్ట్ షాపులు పెట్టారు. కెసిఆర్ డబ్బులు ఇస్తున్నారు అని సంతోషపదుతున్నం..
పెన్షన్లకి 45 లక్షల మందికి ఆయన ఇచ్చేది కేవలం 9000 కోట్లు, పుస్తెలతాడు కడుతున్నప్పుడు ఇచ్చే డబ్బు కేవలం 2000 కోట్లు మాత్రమే.. రైతులకు ఇస్తున్నది కేవలం 9, 10 వేల కోట్లు మాత్రమే..
మూడు కలిస్తే కూడా 22000 అవుతున్నాయి.. కానీ మనం తాగడం ద్వారా సర్కారుకు కడుతున్న డబ్బు 45 వేల కోట్ల రూపాయలు. తెలంగాణ ఆడబిడ్డలారా ఆలోచన చేయండి సంపాదించిన సగం డబ్బులు తాగుడితే ఖర్చు చేస్తున్నరు. తాగుడుకు బానిసై.. కుటుంబాన్ని భర్తలు పట్టించుకోకపోతే ఆడబిడ్డలే నెత్తి మీద వేసుకొని నడుపుతున్న మాట వాస్తవం కాదా..? పుస్తెలు కట్టడానికి 2000 కోట్లు ఇస్తే.. ఆ పుస్తెల తాడులు తెంపడానికి కేసీఆర్ గుంజుకుంటున్న డబ్బు 45 వేల కోట్లు. అనేకమంది తాగుడికి బానిసై చచ్చిపోతే తండ్రి లేని బిడ్డలుగా అనాధ పిల్లలుగా పెరుగుతున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. తెలంగాణ వచ్చిన రోజు మద్యం ద్వారా వచ్చే ఆదాయం పదివేల ఏడువందల కోట్లు అయితే.. ఈనాడు ఆదాయం 45 వేల కోట్లు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేశాను కాబట్టి ఈ విషయాలని మీకు చెప్తున్నాను. ఆటో బయటకు పోవాలన్నా.. ర్యాలీ, ట్రాక్టర్, టూ వీలర్, లారీ ఏది బయటకు పోయినా పోలీస్ క్లిక్ అనిపించి ఫైన్లు వేస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే వేధించడం, డబ్బులు వసూలు చేయడం తప్ప ప్రజలకు న్యాయం చేయాలని సంకల్పం కేసీఆర్ కి లేదు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్లు మాత్రం తంగేళ్లు దాటడం లేదు. “ఒడ్డు ఎక్కదాకా ఓడమల్లన్న ఒడ్డు ఎక్కాక బోడ మల్లన్న” అనేది కేసీఆర్ విధానం. తెలంగాణ వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఎక్కడ కూడా మారలేదు. రెక్కల కష్టమే మిగిలింది. ఆ బాధలే మిగిలాయి తప్ప బాగుపడలేదు. కరోనాలో మీరందరూ ఇంట్లో ఉంటే.. రోగుల మధ్య తిరిగిన బిడ్డను నేను. శవాల తీసుకుపోకుంటే బాధ్యత తీసుకొని ఖననం చేయించిన బిడ్డను నేను. కమిట్మెంట్ ఉన్న వాళ్ళం.భారతీయ జనతా పార్టీగా మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. మీరు ఆశీర్వదిస్తే మీ బిడ్డలగా అండగా ఉంటాం. మీరే న్యాయ నిర్ణేతలు. కేసీఆర్ను ఆపగలిగే శక్తి మీకే ఉంది.
రంగసాయిపేట, గేటు కింది ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. మొత్తం తెలంగాణలో చైతన్యంతో ఉన్న జిల్లాలో కరీంనగర్, వరంగల్ మార్పుకు నాంది పలుకుతాయి. ఆ మార్పు మీతోనే మొదలు కావాలి అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ ర్యాలీలో వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, బీజేపీ సీనియర్ న్యకులు రాజయ్య యాదవ్, సమ్మిరెడ్డి, అశోక్ రెడ్డి, ప్రదీప్ రావు, అచ్చ విద్యాసాగర్, కుసుమ సతీష్, రమణ, మోహన్ ఆచారి, యోగానంద్ పాల్గొన్నారు.