- ప్రజలను, శ్రీ సీతారామచంద్ర స్వామిని సైతం మోసం చేశారు
భద్రాచలం, జూలై 17 (విశ్వం న్యూస్) : సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య సోమవారం ఫిర్యాదు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని ప్రజలకు, శ్రీ సీతారామచంద్ర స్వామికి ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చడం లేదని ఆరోపించారు. 2014లో మొదటిసారి స్వామి వారి కల్యాణానికి కేసీఆర్ వచ్చినప్పుడు రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
గత ఏడాది జూలై 17న సీఎం కేసీఅర్ భద్రాచలంలో పర్యటించారు. గోదావరి వరద గండం నుంచి గట్టెక్కించేందుకు భద్రాచలం వద్ద రూ. వెయ్యి కోట్లతో కరకట్ట నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. కానీ నేటి వరకు రూ.100 కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలను, స్వామివారిని సైతం మోసం చేశారని మండిపడ్డారు.
హామీలు అమలు చేయకపోవడంతో పోలీసుల సహాయాన్ని కోరుతున్నామని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కేసీఅర్ మాట తప్పడంతో ఎమ్మెల్యే పోదెం వీరయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.