కంటి వెలుగు క్యాంపులను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లాలోని ధర్మారం,ఎలిగేడు, జూలపల్లి మండలాలలో పర్యటించి కంటి వెలుగు క్యాంపు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, జనవరి 18 (విశ్వం న్యూస్) : జిల్లాలో కంటి వెలుగు క్యాంపులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ధర్మారం, ఎలిగేడు ,జూలపల్లి మండలాలలో పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ కంటి వెలుగు క్యాంపులలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ రేపటి నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరాల సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కంటి వెలుగు శిబిరాల నిర్వహణ సమయంలో ప్రజలు ఒకేసారి రాకుండా ఉదయం కొంతమంది మధ్యాహ్నం మరికొంతమంది వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జూలపల్లి మండలం కేంద్రంలో పంచాయతీ భవనం వద్ద ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ పరిశీలించి గ్రామపంచాయతీలలో వార్డుల వారీగా ప్రజలను క్యాంపు వద్దకు తీసుకువచ్చేందుకు ప్రణాళిక తయారు చేయాలని, ప్రజలకు 24 గంటల ముందుగానే ఆహ్వాన పత్రికలు అందించాలని కలెక్టర్ సూచించారు.
కంటి వెలుగు వైద్య బృందాలు నైట్ హాల్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ధర్మారం మండలంలోని కొత్తురు గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల, మేడారం, దొంగతుర్తి గ్రామాలలో రైతు వేదికలలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి, ఎంప్లాయ్ మెంట్ అధికారి తిరుపతి రావు,డి. ఆర్.డి. ఓ.శ్రీధర్,ధర్మారం ఎంపీడీవో కే రమేష్, జూలపల్లి ఎంపీడీవో వేణుగోపాల్ రావు, ఎలిగేడు ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ప్రజా ప్రతినిధిలు, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
