సెప్టెంబర్ 4న వల్మీడి కి సీఎం
కేసీఆర్, చిన జీయర్ స్వామి రాక!

- వల్మీడి శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయ పున: ప్రతిష్ఠాపనకు భారీ ఏర్పాట్లు
- అంగరంగ వైభవంగా ఆలయ పునః ప్రారంభం
- సెప్టెంబర్ 1 నుండి 4వ తేదీ వరకు 4 రోజులపాటు ఘనంగా ఉత్సవాలు
- సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలని ప్రజలకు మరోసారి మంత్రి ఎర్రబెల్లి పిలుపు
వల్మీడి (పాలకుర్తి), ఆగస్టు 30 (విశ్వం న్యూస్) : ఆది కావ్యం రామాయణాన్ని రాసిన వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన వల్మీడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, ఆలయ పునః ప్రారంభ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు.

ఆ నాలుగు రోజులపాటు వల్మీడి రాములోరి గుట్ట మీదే కాదు. ఆ వల్మీడి గ్రామంతో సహా, ఆ చుట్టుముట్టు గల అన్నిగ్రామాల్లోనూ పండుగ వాతావరణం ఉట్టిపడేలా మామిడి తోరణాల అలంకరణలు జరగున్నాయి. తీర్థ ప్రసాదాల వితరణతోపాటు భక్తులకు ఆ సీతారాములవారి కరుణా కటాక్ష వీక్షణాలు లభించే విదంగా దర్శనాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఈ నెల 22న సమీక్ష చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరోసారి 30వ తేదీన వల్మీడి గుట్ట మీద జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఇంకా జరగాల్సిన ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు, సలహాలుఇచ్చారు. నిర్ణీత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుజరగాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, ఆది కావ్యంగా కీర్తినందుకున్న రామాయణాన్ని రాసిన వాల్మీకి వల్మీడికి చెందిన వాడుగా చరిత్ర బెబుతున్నది. ఇక్కడి మునుల గుట్ట మీద వాల్మీకి తపస్సు చేసేవాడట. ఆ పక్కనే ఉన్నరాములోరి గుడి మీద రాముడు, సీత ఉండేవారట. రాముడు, సీత స్వయంభువులుగా వెలిశారని, ఆయన పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ఆ రెండు గుట్టల మధ్యవాల్మీకి పురం ఉండేదని, కాల క్రమంలో అక్కడి ప్రజలంతా వల్మీడి గ్రామాన్ని నిర్మించుకున్నారని చెబుతారు. ఇక ఇక్కడికి కూతవేటు దూరంలోనే మహాకవి పాల్కురికి సోమనాథుడు, సహజకవి బమ్మెర పోతనల జన్మస్థానాలున్నాయి. ఇంత పురాతన సాహిత్య చరిత్ర ఉన్న ప్రాంతం ఈ భూమి మీద మరోటి లేదు. ఇంత గొప్ప చారిత్రాత్మక ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా ఉండటం నా అదృష్టం. అన్నారు. ఇక ఈ వల్మీడి రాములోరి గుట్ట మీద స్వయంభుగా వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామిదేవాలయాన్ని పునః ప్రారంభిస్తున్నాం. ఆలయంలోని విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ నెల 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపన జరగనుండగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దిన, కొత్తగా నిర్మించిన దేవాలయాన్ని సీఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు రానున్నారు. ఈ కార్యక్రమాలకు సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి పిలుపునిచ్చారు.