కాంగ్రెస్‌లో చేరిన మరో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం
- కాంగ్రెస్లో చేరిన మూడో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావుతో పాటు ఆయన వర్గీయులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో బీఆర్ఎస్ ఒకే ఒక్క స్థానం (భద్రాచలం)లో విజయం సాధించింది. అయితే భద్రాచలం నుంచి గెలుపొందిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోర్టీ చేరతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతుంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా తెల్లం వెంకట్రావు దూరంగా ఉంటూ వస్తున్నారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కలవడంతో పాటు కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటూవస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైందనే ప్రచారం సాగింది. శనివారం (ఏప్రిల్ 6) రోజున తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో కూడా తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సభ వేదికగానే రాహుల్ గాంధీ సమక్షంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగింది.
అయితే అలా జరగలేదు. అయితే నేడు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మూడో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.