కేసీఆర్ కనబడుట లేడు

- గజ్వేల్ అంతటా పోస్టర్లు, ర్యాలీలు!
సిద్దిపేట, జూన్ 16 (విశ్వం న్యూస్) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో తెలంగాణ బీజేపీ నేతలు హడావుడి చేశారు. గజ్వేల్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి సొంత నియోజకవర్గానికి కేసీఆర్ రావడం లేదని వారు నిరసనలు చేశారు. ఈ మేరకు గజ్వేల్ పట్టణంలో పలు చోట్ల కేసీఆర్ కనబడడం లేదు అని పోస్టర్స్ ను ముద్రించి అంటించారు. అంతేకాక, ఫ్లెక్సీలు పట్టుకొని నిరసనలు కూడా చేశారు.

కేసీఆర్ ఎక్కడున్నా గజ్వేల్‌కు రావాలి అంటూ నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఆ పోస్టర్లలో కేసీఆర్ బొమ్మతో పాటు ఆయన గుర్తులుగా తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు లేదా తెల్ల లుంగీ వేసుకుంటారని.. నెత్తి మీద టోపీ పెట్టుకుంటారని.. ఆయనో భయంకరమైన హిందువు అంటూ రాశారు. పైగా కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి అని.. ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి అని పోస్టర్లలో ఎద్దేవా చేస్తూ రాసుకొచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పేరుతో ఈ పోస్టర్లను ముద్రించారు.
చిరునామా, పూర్తి పేరు: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వయసు – 70 సంవత్సరాలు.
ప్రొఫెషన్ – అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం. బాధ్యత – గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రివర్యులు. గుర్తులు – తెల్లచొక్కా, తెల్ల ప్యాంట్ లేదా తెల్ల లుంగీ, నెత్తి మీద టోపీ
అర్హతలు – భయంకరమైన హిందువు, 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి, ఎకరాకు రూ.కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి.