సామాజిక మాధ్యమాల్లో జరిగే మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి

సామాజిక మాధ్యమాల్లో జరిగే మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి

యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సీనియర్ సివిల్ జడ్జ్ కం అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ ఎం.అర్జున్

పెద్దపల్లి, జనవరి 24 (విశ్వం న్యూస్) : జిల్లాలో యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండి, సామాజిక మాధ్యమాల్లో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యం.అర్జున్ తెలిపారు. మంగళవారం స్థానిక వికాస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యం.అర్జున్ పాల్గొని విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యం.అర్జున్ మాట్లాడుతూ, సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఇది చట్టాలపై కనీస పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడే సాధ్యమౌతుంది అని తెలిపారు. జిల్లా, మండల స్థాయి లీగల్ సర్వీసెస్ లో తమ సమస్యను ఒక తెల్ల కాగితంపై రాసి న్యాయ సేవలు, సహాయం పూర్తిగా ఉచితంగా పొందవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ వారి హక్కులపై, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారం సులువుగా ఎలా పొందాలనే విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని, విద్యార్థినులు ఫోన్ల లో అధిక సమయం గడపవద్దని, సామాజిక మాధ్యమాలలో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న ఆకర్షణలకు లోను కావద్దని ప్రస్తుత వయసులో జీవితంలో లక్ష్యసాధన పై మాత్రమే దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థినులు తాము భవిష్యత్తులో ఏమి కావాలి, ఎలా వుండాలి అనేది నిర్ణయించుకొని లక్ష్యాన్ని సాధించేలా కృషి చేయాలని, సమయాన్ని అనవసర పనులకు వృధా చేయరాదని, ఫోన్ లో ఛాటింగ్, మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని, తమ సమాచారం తెలియని వారికి షేర్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్ లో భద్రతకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ లను కలిగి ఉండి అవగాహన కలిగి ఉండాలనీ తెలిపారు.
విద్యార్థినులు ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఆపద ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళా సమానత్వం, మహిళా సాధికారత ముఖ్యమైన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవడం వల్ల లభిస్తుందని, దాని సాధన దిశగా మీరంతా కృషి చేయాలని ఆయన సూచించారు.
చట్టాలపై, హక్కులపై అవగాహన కలిగి సమాజానికి ఉపయోగపడే విధంగా, తమ ప్రక్కన ఉన్న వారికి చేయూతనివ్వాలని, కుటుంబ గౌరవం పెంపొందెలా లక్ష్యసాధన వైపు అడుగులు వేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ గృహ హింస, వరకట్న నిషేధ చట్టం, సమాచార హక్కు చట్టం, వినియోగదారుల హక్కు చట్టాలపై అవగాహన కలిగిస్తూ, బ్యాంకుల్లో అదనపు ఛార్జ్, విద్యార్థినులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ , బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ బాబు, అడ్వకేట్ లు, కోర్టు సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది ,విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *