
హైదరాబాద్, ఆగస్టు 27 (విశ్వం న్యూస్) : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. కవితను అరెస్టు చేసి నేటికి 164 రోజులు కాగా.. జ్యుడిషీయల్ కస్టడీలో భాగంగా ఆమె 153 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. పలుమార్లు ఆమె బెయిల్ కోసం సీబీఐ, ఈడీ కోర్టులను ఆశ్రయించగా చేదు అనుభవమే ఎదురైంది. దీంతో కవిత సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఈ పిటిషన్ విచారణకు రాగా.. జస్టిస్ గవాయ్, విశ్వానాథ్లతో కూడిన ధర్మాసనం ఆణెకు బెయిల్ మంజూరు చేసింది.
ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితు మార్చి 15న హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈడీ కోర్టు ఆమెకు మార్చి 26న జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. అప్పటి నుంచి కవిత తీహార్ జైలులోనే ఉన్నారు.
ఇదే కేసులో సీబీఐ ఆమెను ఏప్రిల్ 15న అరెస్టు చేసింది. పలు మార్లు సీబీఐ అధికారులు ఆమెను విచారించి అభియోగాలు మోపారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు అక్రమ లావాదేవీలు జరిపినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 153 రోజులు జైలులో ఉన్న కవిత దాదాపు 11 కేజీలు బరువు తగ్గారు.