- చెన్నై పోలీసులు కళ్లుగప్పి హైదరాబాద్లో ఆశ్రయం పొందుతూ దొరికిన నటి
హైదరాబాద్, నవంబర్ 16 (విశ్వం న్యూస్) : తెలుగు వారిపై చెన్నైలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి శనివారం హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. ఆమెపై చెన్నైలో పలు కేసులు నమోదవగా.. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్కి వచ్చి ఆశ్రయం పొందుతున్న ఆమెని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలిస్తున్నారు.
ఏంటి కస్తూరి వివాదం?
నవంబరు 3న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నటి కస్తూరి.. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల కిందట రాజు గారి అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని.. వాళ్లు ఇప్పుడు తాము తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారంటూ కస్తూరి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారంటూ కూడా కస్తూరి చెప్పుకొచ్చారు.