అనంతపురం, నవంబర్ 17 (విశ్వం న్యూస్) : అనంతపురం తాడిపత్రి మండలంలో విషాదం జరిగింది. వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గీత(24)కు ఆదివారం నిశ్చితార్థం కుదిరింది. గోరింటాకు పెట్టించుకుందామని శనివారం తమ్ముడితో కలిసి బైక్‌పై పక్కూరి వెళ్లింది. తిరిగొచ్చే క్రమంలో ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ రెడ్డి, లక్ష్మీదేవిలకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె గీత, మరో కుమార్తె బిందు, కుమారుడు నారాయణ రెడ్డిలు ఉన్నారు. తల్లిదండ్రులు వీరి ముగ్గురినీ బీటెక్ చదివించారు.
వీరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనుకున్నారు. కానీ తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పెద్ద కూతురు అయిన గీత(24)కు పెళ్లి చేయాలనుకున్నారు. ఒక మంచి సంబంధం కుదరింది. దీంతో ఆదివారం (ఇవాళ) ఎంగేజ్‌మెంట్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే గోరింటాకు పెట్టించుకోవడానికి గీత తాడిపత్రికి తన తమ్ముడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై వెళ్లింది.
గోరింటాకు పెట్టించుకుని తిరిగి తమ గ్రామానికి వస్తున్న క్రమంలో బుగ్గవైపు నుంచి వస్తున్న ఒక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గీత అక్కడికక్కడే మరణించింది. ఇక నారాయణరెడ్డి తలకి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.
ఇక త్వరలో పెళ్లి అని ఎంతో సంబరపడిన ఆ కుటుంబంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అంతకంటే ముందు నిశ్చితార్థం మరో రోజులో జరగనుండగా.. తన కూతురు మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దేవుడా ఎంతపని చేసావయ్యా అంటూ రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.