హైదరాబాద్, డిసెంబర్ 2 (విశ్వం న్యూస్) : కళాశాల యాజమాన్యం వేధింపులతో మరో ఇంటర్ విద్యార్థి బలయ్యాడు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ లోని నారాయణ కళాశాలలో సోమవారం సాయంత్రం ఇంటర్ విద్యార్థి ఉరివేసు కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ తరలించగా విద్యార్థి అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో …విషయం వెలుగులోకి రాకుండా యాజమాన్యం చాకచక్యం గా విద్యార్థి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిం చినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే… ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న భానోత్ తనుష్ నాయక్ (16) అలియాస్ టింకు సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో బాత్రూంకని వెళ్లి బయటికి రావడం ఆలస్యం కావడం తో తోటి విద్యార్థులు గమనించి వెళ్లి చూడగా టింకు ఉరివేసుకొని ఉన్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న యాజమాన్యం హుటాహుటిన విద్యార్థిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందాడని తెలియడంతో విద్యార్థి బంధువులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే యాజమాన్యం వేధింపుల కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసుబందోబస్తు ఏర్పాటు చేసారు.