ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్​ ప్రతిపక్ష పాత్ర పోషించారా?

ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్​
ప్రతిపక్ష పాత్ర పోషించారా?

  • ఇప్పుడు గాలి బ్యాచ్​లను ప్రజలపై వదిలారు..
  • నల్గొండలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 7 (విశ్వం న్యూస్) : 2014 జూన్ 2కు ఎంత ప్రాధాన్యత ఉందో.. 2023 డిసెంబరు 7కు అంతే ప్రాధాన్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిదని అన్నారు. నల్గొండ జిల్లాలోని మెడికల్ కాలేజీలో జరిగిన తొలి ఏడాది కాంగ్రెస్ పాలన- కాంగ్రెస్ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండ వ్యక్తేనని అన్నారు. నల్గొండలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ రైతాంగ పోరాటం గుర్తొస్తుందని పేర్కొన్నారు. నల్గొండలో కృష్ణాజలాలు ప్రవహిస్తే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారని తెలిపారు.

కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన చెందారు. ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్ పాలనలోనే నల్గొండకు అధిక నష్టం జరిగిందన్నారు. నల్గొండకు కృష్ణా జలాలను తెచ్చి సస్యశ్యామలం చేస్తాం. వరి వేస్తే.. ఉరేసుకున్నట్లే అని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. మా హయాంలో వరికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇచ్చాం. మూడురోజుల్లోనే రైతులకు ధాన్యం అమ్మిన డబ్బులు చెల్లిస్తున్నాం. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డు సృష్టించింది. గతంలో ఎమ్మెల్యేలను లాక్కొన్నా.. వెనుకడుగు వేయకుండా పోరాడాం. ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా?. గెలిస్తే ఉప్పొంగిపోవడం.. ఓడితే కుంగిపోవడం కేసీఆర్‌ స్థాయికి తగదు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ప్రజల్లో ఉండి ఎంపీగా గెలిచాను.” అని రేవంత్ రెడ్డి అన్నారు.

గాలి బ్యాచ్ ను కేసీఆర్ ప్రజలపైకి వదిలారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా వద్దంటున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు వద్దంటే.. తెలంగాణ ఎలా ముందుకెళ్తుంది అని ప్రశ్నించారు. 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే అందులో నల్గొండ జిల్లాకు వేల ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. దేశ చరిత్రలో ఏడాది పాలనలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో 55 వేల ఉద్యోగాలైన ఇచ్చారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే దిల్లీలో క్షమాపణలు చెబుతానంటూ సవాల్ విసిరారు.

రాష్ట్ర ప్రభుత్వంపై జేపీ నడ్డా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త నల్గొండ జిల్లాలోనే రూ.2,400 కోట్లు రుణమాఫీ జరిగిందని వివరించారు. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. రూ.500కే సిలిండర్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. రాజీవ్ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంచింది తమ ప్రజా ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆత్మగౌరవంతో బతికేందుకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబం చేసిన అప్పులకు రూ.65 వేల కోట్ల వడ్డీ కడుతున్నామని వెల్లడించారు.

సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు : సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులు వేస్తాం. సన్నాలను పండిస్తే రూ.500 బోనస్ ఇస్తాం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తాం. రైతులు సన్నాలు పండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రైతులు పండించే సన్నాలనే రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తాం. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో సన్నాలనే భోజనానికి వినియోగిస్తాం. రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెలు లబ్డబ్ కొట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ : 50 వేల ఎకరాల్లో కొత్త సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎయిర్ పోర్టు కూత వేటు దూరంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామన్నారు. ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత తనది అని సీఎం అన్నారు. ఫోర్త్ సిటీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూసీని ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ : అంతకు ముందు నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకి పూలు చల్లారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ పనులను ప్రారంభించారు.

యాదాద్రి థర్మల్ ప్లాంట్ జాతికి అంకితం : సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దామరచర్లలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్-2 ఫొటో ప్రదర్శననను సీఎం తిలకించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్ ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. వైటీపీఎస్ పనులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *