- మాజీ జర్నలిస్ట్ అరెస్ట్
హైదరాబాద్, డిసెంబర్ 8 (విశ్వం న్యూస్) : వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ వీడింది. రూ.5 లక్షల అప్పు ఇవ్వనందుకే మాజీ జర్నలిస్ట్ హత్య చేసినట్లు తేలింది. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు… కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
వరంగల్ నగరంలో కలకలం సృష్టించిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజా మోహన్ మర్డర్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. సీసీ కెమెరాలతో పాటు క్షేత్ర స్థాయిలో జరిపిన విచారణ ఆధారంగా వరంగల్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కాగా అప్పు ఇస్తానని చెప్పి ఇవ్వనందుకే ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన మాజీ యూట్యూబ్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు.
ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి పంపించారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన జక్కుల శ్రీనివాసరావు హనుమకొండలోని రెవెన్యూ కాలనీ ప్రగతి నగర్ లో కొంతకాలంగా ఉంటున్నాడు. తన స్వగ్రామం కోమటిపల్లికి చెందిన మణెమ్మ అనే మహిళతో సహజీవనం చేస్తూ ప్రగతి నగర్ లోనే నివాసం ఏర్పరచుకున్నాడు.
రూ.5 లక్షల అప్పు తెచ్చిన ముప్పు
హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వెలిగేటి రాజామోహన్ భార్య చాలా కాలం కిందటే చనిపోయింది. ఆయనకు ఇద్దరు ఆడ పిల్లలు కాగా.. ఒకరు యూఎస్ఏలో, ఇంకొరు హైదరాబాద్ లో ఉంటున్నారు. కాగా దాదాపు రెండు నెలల కిందట రాజామోహన్ కు ఓ ఫోన్ దొరకగా.. దానిని ఇచ్చే క్రమంలో జక్కుల శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడుకున్న తరువాత ఎవరైనా వితంతువు ఉంటే పెళ్లి చేసుకుంటానని రాజా మోహన్ శ్రీనివాసరావుకు చెప్పాడు.
దీనిని ఆసరాగా తీసుకున్న శ్రీనివాసరావు తన బిజినెస్ కు రూ.5 లక్షల వరకు అవసరం అవుతాయని, తనకు అప్పుగా ఆ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా రాజా మోహన్ ను అడిగాడు. దీంతో తాను రూ.5 లక్షల అప్పు ఇచ్చేందుకు అంగీకరించగా.. డబ్బుల కోసం శ్రీనివాసరావు చాలా సార్లు రాజా మోహన్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మద్యం తాగి తిరిగి వచ్చేవారు. కాగా అప్పుగా ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీనివాసరావు రాజా మోహన్ పై ఒత్తిడి పెంచాడు. దీంతో రాజా మోహన్ తన వద్ద డబ్బులు లేవని, అప్పు ఇవ్వడం కుదరదని చెప్పేశాడు. అప్పటి నుంచి శ్రీనివాసరావు రాజా మోహన్ ను చంపి ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్నైనా తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు.
ఇంట్లోనే దారుణ హత్య
రాజా మోహన్ ఒంటిపై ఉన్న బంగారం కోసం ఆయనను చంపేందుకు నిర్ణయించుకున్న శ్రీనివాసరావు ఈ నెల 2వ తేదీన సాయంత్రం సమయంలో ప్రగతి నగర్ లోని తన ఇంటికి రాజా మోహన్ పిలిచాడు. దాదాపు 9.30 గంటల ప్రాంతంలో తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం డబ్బుల విషయంలో మళ్లీ డిస్కషన్ జరగగా.. ఇంట్లో ఉన్న రోకలి బండతో రాజా మోహన్ తలపై శ్రీనివాసరావు దాడి చేశాడు.
తలపై విచక్షణారహితంగా దాడి చేసి, ఆయనను చంపేశాడు. అనంతరం అతని ఒంటిపై ఉన్న బంగారు బ్రాస్లెట్, గొలుసు. మూడు ఉంగరాలు తీసుకున్నాడు. ఆ తరువాత డెడ్ బాడీని దండెంతో తాడుతో కట్టేశాడు. కాళ్లు కొట్టు కొంటుండటంతో పాత కుక్క గొలుసుతో కాళ్లు కూడా కట్టేశాడు. అనంతరం గోనె సంచిలో మృతదేహాన్ని పెట్టి రాజా మోహన్ కారులోనే వెనుక సీటులో పెట్టుకుని సిటీ శివారులో ఎక్కడైనా పడేద్దామని నిర్ణయించుకున్నాడు.
తన ప్లాన్ ప్రకారం కారును నడుపుకుంటూ తన ఇంటి నుంచి వడ్డేపల్లి, కేయూసి జంక్షన్ మీదుగా, పెగడపల్లి డబ్బాలు, రెడ్డిపురం చెరువు వరకు వెళ్లాడు. అక్కడ డెడ్ బాడీని పడేద్దామనుకునేసరికి అటువైపు జన సంచారం ఎక్కువగా ఉండటంతో కారును కెనాల్ లో పడేసే ఆలోచన చేశాడు. కానీ అది కూడా వీలుకాకపోవడంతో అక్కడి నుంచి ములుగు రోడ్డుకి వచ్చి ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం జంక్షన్, గ్రేటర్ వరంగల్ పక్కన ఉన్న పెట్రోల్ బంక్, భద్రకాళి గుడి దాటి రంగంపేట ఏరియాకు వచ్చాడు. అక్కడ జన సంచారం లేకపోవడంతో రోడ్డు పక్కన కారును నిలిపి మృతుడు రాజా మోహన్ కు సంబంధించిన చెప్పులను అక్కడే ఓ ఇంటి దగ్గర వదిలిపెట్టి నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. అనంతరం ఆటో ఎక్కి అక్కడి నుంచి ఉడాయించాడు. తన ఇంటి వద్ద కూడా ఎలాంటి ఆధారాలు దొరకకుండా రక్తపు మరకలను కడిగేసి, జాగ్రత్తపడ్డాడు.
నాలుగు టీమ్లు.. వెయ్యి కెమెరాలు
వరంగల్ నగరం నడి మధ్యన ఈ ఘటన జరగగా.. కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఘటనా స్థలం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వరంగల్ ఏసీపీ సందిరాం ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి సీసీ కెమెరాలు పరిశీలించి, నిందితుడు ప్రయాణించిన ఆటోని గుర్తించారు.
అనంతరం వరంగల్ నగరంలోని ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి నుంచి వివరాలు సేకరించారు. ఆ తరువాత కూపీలాగీ నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుండి మృతునికి సంబంధించిన సెల్ ఫోన్, సుమారు నాలుగున్నర తులాల బంగారు బ్రాస్లెట్, చైన్, మూడు ఉంగరాలతో పాటు హతమార్చేందుకు ఉపయోగించిన రోకలి బండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మట్వడా సీఐ తుమ్మ గోపి, ఎస్సైలు విఠల్, నవీన్, సాంబయ్య, లచ్చయ్య ఇతర అధికారులను వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా, ఏసీపీ నందిరాం నాయక్ అభినందించారు.