అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి
హైదరాబాద్, డిసెంబర్ 22 (విశ్వం న్యూస్) : పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంపై గుర్తు తెలియని కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడినట్లు సమాచారం. అల్లు అర్జున్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దశలో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఓయూ జెఎసి విద్యార్థులు ఈ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
విద్యార్థుల ఆందోళన, అరెస్ట్
సంధ్య థియేటర్‌లో తోపులాట ఘటనకు, రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ ఓయూ జేఎసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటిముందు ఆందోళన నిర్వహించారు. ఇంటి లోపలకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. కొందరు దుండగులు అల్లుఅర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. రేవతి చావుకు అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి తక్షణమే రూ.కోటి సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై పోలీసుల క్లారిటీ
డిసెంబర్4వ తేదీన సంద్యథియేటర్‌కు అల్లుఅర్జున్ రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారని, థియేటర్ లోపలకు వెళ్లేందుకు, హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో తోపులాట జరిగిందని ఏసీపీ సంతోష్ చెప్పారు. తోపులాటలో దురదృష్టవశాత్తు ఓ..మహిళ మృతి చెందిందని, ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌కు చెప్పామన్నారు. అల్లు అర్జున్‌కు విషయం చెప్పేందుకు ప్రయత్నించగా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ అంగీకరించలేదని, తాము సమాచారం చేరవేస్తామని చెప్పి చేరవేయలేదన్నారు. తొక్కిసలాట తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అల్లు అర్జున్‌కు ఎంత చెప్పినా వినిపించుకోలేదన్నారు. డీసీపీ ఆదేశాలతో తాను అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పామన్నారు. సినిమా చూసిన తర్వాత వెళ్తానని చెప్పారని, ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చామన్నారు. చివరకు డీసీపీతో వెళ్లి అల్లు అర్జున్‌ను బయటకు తీసుకువచ్చామని ఏసీపీ రమేశ్ తెలిపారు.