ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ
ప్రార్థనలు చేయండి

- వరంగల్ బిషప్ ఉడుముల బాల
- ముగిసిన ఫాతిమా మాత ఉత్సవాలు
కాజీపేట, మార్చి 13 (విశ్వం న్యూస్) : ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేయాలని విశాఖ అగ్ర పీఠాధిపతి, వరంగల్ బిషప్ ఉడుముల బాల పిలుపునిచ్చారు. కాజీపేట పట్టణంలోని ఫాతిమా నగర్ లో గల ఫాతిమా కేథడ్రల్ చర్చి లో నిర్వహిస్తున్న ఫాతిమా మాత ఉత్సవాలు గురువారం ముగిసాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉడుముల బాలకు ఘన స్వాగతం లభించింది. వరంగల్ బిషప్ గా కొనసాగుతున్న ఉడుముల బాలకు ఇటీవల విశాఖ అగ్ర పీఠాధిపతిగా నియమితులైన నేపథ్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఫాతిమా మాత ఆశీస్సులతో ప్రపంచశాంతినీ సాధిస్తామని విశ్వాసం ప్రకటించారు. ఏసుక్రీస్తు బోధనలను ఆచరిస్తూ.. విశ్వశాంతి కోసం ప్రతి ఒక్కరు తపించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫాదర్ జయప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీలలో విజయం సాధించిన వారికి ఉడుముల బాల బహుమతులను ప్రధానం చేశారు.

ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి. రాజయ్య, కార్పొరేటర్ మానస, విచారణ గురువు కాసు మరెడ్డి, ఫాదర్లు జోసెఫ్, ఆశీర్వాదం, విజయపాల్, అను కిరణ్, గంగారపు నవీన్, ఫాతిమా చర్చి విచారణ కౌన్సిల్ అధ్యక్షులు బొక్క దయాసాగర్, ప్రధాన కార్యదర్శి, టి డి టామీ, ట్రెజరర్ అల్లం ప్రకాష్ రెడ్డి పలువురు వరంగల్ బిషప్ ఉడుముల బాలను ఘనంగా సత్కరించారు.
వార్త…శ్యామ్🖋️