తెలంగాణ ప్రజల ఆశయ నాయకుడు బాపు కేసీఆర్ : వరంగల్ సభలో ప్రజా ప్రవాహం

జన హృదయ నివేదన

వరంగల్, ఏప్రిల్ 28 (విశ్వం న్యూస్): తెలంగాణలో ప్రజా హృదయాలను స్పర్శించిన నాయకుడు బాపు కేసీఆర్ చరిత్రలో మరొక గంభీర ఘట్టాన్ని రాశారు. నదులు కలిసిపోయి మహా ప్రవాహం సృష్టించినట్లే, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు కలిసి వరంగల్ వైపు సాగిపోయాయి. లక్షలాది మంది ప్రజలు ఒక పవిత్ర యాత్రగా భావించి తమ ప్రియతమ నాయకుడిని చూడటానికి, ఆయన మాటలు వినటానికి వరంగల్ సభా ప్రాంగణాన్ని నింపేశారు. ప్రతి ఒక్కరి మనసులోనూ ఒకే అభిమానం — బాపు కేసీఆర్ కోసం ఉన్న మక్కువ. ఆయన నడిపిన ఉద్యమం ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను జనం హృదయపూర్వకంగా గుర్తుచేసుకున్నారు. సభకు హాజరైన వారు తల్లి దండ్రిని దర్శించినట్టుగా గర్వంతో, సంతృప్తితో వెనుదిరిగారు.

బాపు పాలన: అభివృద్ధికి ప్రతీక
బాపు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు — ఆరోగ్య లక్ష్మి పథకం, కేసీఆర్ కిట్, ఉచిత కరెంటు, రైతు బంధు, పింఛన్ పథకాలు — రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. తెలంగాణ వ్యవసాయరంగం పునరుత్థానమైంది. వ్యవసాయం పండుగలా మారింది. రైతుల కడుపు నింపే పాలకుడిగా కేసీఆర్ నిలిచారు. బాలింతలు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఆయన చర్యల వల్ల గౌరవప్రదంగా జీవనాన్ని గడుపుతున్నారు. వరంగల్ వేదికగా ప్రజలు మరోసారి గుర్తుచేసుకున్నారు — బాపు పాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా, సుభిక్షంగా నిలిచిందని.

ప్రజాస్వామిక విలువలకు పరిరక్షకుడు
కేవలం అభివృద్ధి కాదు, ప్రజాస్వామిక విలువలను గౌరవిస్తూ, రాజ్యాంగ మార్గాన్ని అనుసరిస్తూ కేసీఆర్ తన నాయకత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపించిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. నక్సలైట్ల సమస్య పరిష్కారానికి చర్చల మార్గాన్ని సూచిస్తూ, చత్తీస్గఢ్‌లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్‌కు సభా ప్రాంగణం చప్పట్లతో మద్దతు తెలిపింది. ప్రజాసంఘాల మేధావులు, సామాన్య ప్రజానీకం కూడా బాపు కేసీఆర్ మాటలను గౌరవించారు.

తెలంగాణ ప్రజల జీవితాల్లో భాగమైన నాయకుడు
“ఆయువు ఉన్నంతకాలం శరీరంనుండి ఆత్మను వేరు చేయలేనట్లే, తెలంగాణ సమాజం నుంచి బాపు కేసీఆర్‌ను వేరు చేయడం ఎవరి తరముకాదు” — ఈ మాటలను సభా వేదిక స్పష్టంగా చాటింది. కేసీఆర్ వ్యక్తిత్వం తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
ఇది ఒక నాయకుడి విజయగాధ మాత్రమే కాదు, ఒక ప్రజా ప్రస్థానం. బాపు కేసీఆర్ తెలంగాణ ప్రాణంగా ఉన్నాడని, ఆయన నేతృత్వం మాత్రమే రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి మార్గంలో నడిపించగలదని లక్షలాది జనం మరోసారి ధృవీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *