
హైదరాబాద్, జూన్ 17 (విశ్వం న్యూస్): ఇందిరాపార్క్ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన “మహాధర్నా”లో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఆపరేషన్ కగార్” ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
“ఇది భద్రత పేరిట సాగుతున్న కార్పొరేట్ కబ్జా యుద్ధం. గిరిజనుల జీవనవిధానంపై, ప్రకృతి వనరులపై కేంద్రం యుద్ధం ప్రకటించింది” అని ఆయన ధ్వజమెత్తారు. ఇది మానవహక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు.

❝ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకు తుపాకీతో సమాధానం ఇవ్వడం అనాగరికం. ఇది తాలిబాన్ పాలన కాదు… చర్చలే శాశ్వత మార్గం❞ – డా. శ్రవణ్
మావోయిస్టు పేరుతో గిరిజనులపై దాడులా?
మావోయిస్టులు కోరేది శస్త్రపోరాటం కాదు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం వారి పోరాటం. ఇవే విషయాలు భారత రాజ్యాంగం వాగ్దానం చేసింది. కానీ గిరిజనులకు ఇవేవీ లభించకపోతే, వారు ప్రశ్నించక తప్పదు.”
“బ్యాంక్ రుణం దొరకని గిరిజనుడు ప్రశ్నిస్తే… గుండెగుల్లా కాల్చడం దౌర్భాగ్యం”
“ఆదివాసీల భూముల్లో కేంద్రం అనుమతి లేకుండా విస్తరణ చర్యలు చేపడుతోంది. ఇది 5వ షెడ్యూల్‌కు విరుద్ధం. ప్రజల భద్రత పేరిట… ప్రజలే మాయమయ్యే పరిస్థితిని కేంద్రం కల్పిస్తోంది” అని విమర్శించారు.
BRS పార్టీ డిమాండ్లు స్పష్టం:

- “ఆపరేషన్ కగార్” తక్షణమే నిలిపివేయాలి
- దాడుల్లో మృతులపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి
- గిరిజన భూములపై కేంద్రం స్వామ్య హక్కులను గౌరవించాలి
- గ్రామసభల అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టకూడదు
- మావోయిస్టు సమస్యపై కేంద్రం చర్చల బాట పట్టాలి
బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల పక్షాన నిలుస్తుంది
విభజన రాజకీయాలతో కాకుండా రాజ్యాంగ విలువలతో సమస్యలకు పరిష్కారం చూపాలన్నది బీఆర్ఎస్ పార్టీ ధ్యేయంగా ఉన్నదని పేర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
“ప్రజల గళాన్ని అణచడం కాదు, గౌరవించాలి. ప్రజలు భయపడే సమాజం కాదు — ప్రశ్నించే సమాజమే నిజమైన ప్రజాస్వామ్యం” అని డా. శ్రవణ్ ఘాటుగా హెచ్చరించారు.