గ్లాస్‌లో సోడా కాదు…
గోదావరి నీళ్లు!

తిరుమలగిరి, జూలై 14 (విశ్వం న్యూస్) : తుంగతుర్తి గడ్డపై కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడి ఉంటుందని, రాబోయే రోజులు కాంగ్రెస్ పరిపాలనకు సింహావాహనమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలగిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన విరుచుకుపడ్డారు. పేదల ఆత్మగౌరవానికి రేషన్ కార్డు చిహ్నమని, తమ ప్రభుత్వం మూడు కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నదని గుర్తు చేశారు. “ఇది బెల్టుషాప్‌ల పాలన కాదు – బియ్యం కోసం బారుల తీరే పాలన” అని దుయ్యబట్టారు.
రైతులకు రూ.500 బోనస్, రైతుభరోసా, రుణమాఫీ వంటి పథకాలు ఇందిరమ్మ పాలనలోనే సాధ్యమవుతాయని తెలిపారు. ఇప్పటివరకు 25 లక్షల మందికి రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. కేవలం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. “గ్లాస్‌లో సోడా కాదు – గోదావరి నీళ్లు తెస్తాం” అంటూ కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ గోదావరి జలాలు తీసుకురానివారికి ఇప్పుడు హక్కు లేదన్నారు. తుంగతుర్తికి గోదావరి నీళ్లు తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి ఇప్పటికే రూ.6,500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు చీరలు, 21 వేల కోట్ల రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. మహిళల కోసం పెట్రోల్ బంకులు, బస్సులు, సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం చేపడుతోందన్నారు. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, వచ్చే రెండు ఏళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు. “కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. కానీ కాంగ్రెస్ నిర్మించిన సాగర్, శ్రీశైలం ముద్దుగా నిలిచాయి” అని ఆయన విమర్శించారు.
తుంగతుర్తి ప్రజలకు గంజాయి మొక్క గురించి గుర్తుచేస్తూ, వచ్చే ఎన్నికల్లో దాన్ని పీకేయాలని పిలుపునిచ్చారు. “నీ ఊరి తీసినా పాపం లేదు. తెలంగాణ ధనం దోచినవాళ్లను ప్రశ్నించాలి” అని విజ్ఞప్తి చేశారు. విభజన హక్కులు – బీసీలకు ప్రాధాన్యం:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, కులగణనపై తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. “2024 నుంచి 2034 వరకూ కాంగ్రెస్ పాలనే ఉంటుంది. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.