ముగిసిన ఖైరతాబాద్ మహా గణేష్‌ నిమజ్జనం

ముగిసిన ఖైరతాబాద్
మహా గణేష్‌ నిమజ్జనం

హైదరాబాద్‌, సెప్టెంబర్ 6 (విశ్వం న్యూస్): తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తుల సందడి మధ్య ఘనంగా పూర్తయ్యింది. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువుతో ప్రతిష్ఠించబడిన మహాగణనాథుడు 11 రోజుల పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేరాడు.

శుక్రవారం అర్థరాత్రి కలశపూజలతో ప్రారంభమైన నిమజ్జన మహోత్సవం, వేకువజామున శోభాయాత్రగా ఆరంభమైంది. ప్రత్యేక వాహనంపై మహాగణపతిని అమర్చగా, సంప్రదాయ మేళతాళాలు, డోలు వాయిద్యాలతో శోభాయాత్ర కనుల పండుగగా సాగింది.

భక్తులు తాండోపతాండాలుగా తరలి వచ్చి గణనాథుడిని పూలతో అలంకరించారు. “జైబోలో గణేశ్ మహారాజ్ కి జై!” అంటూ జయజయధ్వానాలు మార్మోగాయి. మార్గమంతా భక్తులు నీరాజనాలు పలుకుతూ మహాగణపతిని సాగరతీరానికి చేరవేశారు.

శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం దారుల గుండా హుస్సేన్ సాగర్ చేరాడు. నగరమంతా జనసందోహంగా మారగా, ఈ మహా క్రతువు అందరి హృదయాలను హర్షభరితంగా చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *