
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందడిగా సాగింది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో లక్షలాది భక్తులు గణపతిని నిమజ్జనం చేశారు. ఇలాంటి సందర్భాల్లో బందోబస్తు పరిస్థితులను హోంమంత్రి, ఉన్నతాధికారులు పర్యవేక్షించడం ఆనవాయితీ. అయితే ఈసారి వేరే దృశ్యం కనబడింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాన్వాయ్ లేకుండా రోడ్డు మార్గంలో పర్యటించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్ ద్వారా పరిస్థితులను గమనించారు.
అయినా జనం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వాహనంలో డోర్‌తెరిచి నిలబడి ప్రజలకు చేతులు ఊపినా, ఎవ్వరూ పట్టించుకోలేదు. అనంతరం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వేదికపైకి చేరుకున్న సీఎం “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేసినా, ఆ నినాదాలకు అనుగుణంగా జనం నుంచి ప్రతిస్పందన కనిపించలేదు.
మరోవైపు, కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లో ఉన్నా ట్యాంక్ బండ్ మీద మాత్రం బీఆర్ఎస్ పాటలు, గులాబీ నినాదాలే గర్జించాయి. ప్రజల మధ్య బలంగా వినిపించిన కేసీఆర్ శక్తి పాటలు కాంగ్రెస్ శిబిరాల్లో గుబులు రేపుతున్నాయి. “సీఎం, మంత్రులు వచ్చినా పట్టించుకోలేదు, కేసీఆర్ పాటలే దద్దరిల్లాయి” అనే చర్చలు జనం మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో గణేష్ నిమజ్జనం వేదికపై గులాబీ ప్రభావమే ప్రధాన చర్చనీయాంశమైంది.