
శ్రీశైలం, సెప్టెంబర్ 7 (విశ్వం న్యూస్): “కేసీఆర్ గారు సాధారణ నాయకుడు కాదు… ఆయన గరళకంటుడు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు ఎదురైనా ఆయన తట్టుకుని నిలిచే శక్తివంతుడైన నాయకుడు. స్వామి–అమ్మవారి ఆశీస్సులతో కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా అవుతారు” అని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.

శ్రీశైలంలో స్వామి, అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ – “ప్రజల ఆశీస్సులు, భగవంతుని దయ ఉంటే కేసీఆర్‌ను ఎవ్వరూ అడ్డుకోలేరు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం నుండి ఇప్పటి వరకూ ఆయన ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, కుట్రలు అన్నీ గరళంలా మింగి ముందుకు నడిపించారు. అదే ఆయన గరళకంటుడు అనే బలం” అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడి చేసిన శ్రవణ్ – “రేవంత్ రెడ్డి గారు రోజూ అబద్ధపు ప్రచారమే చేస్తున్నారు. ప్రజలకు చేయగలిగింది ఏమీ లేదు. బదులుగా కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎవరిని నమ్మాలో తెలుసు. భవిష్యత్తు మళ్లీ కేసీఆర్ సారథ్యంలోనే వెలుగుతుంది” అని తేల్చి చెప్పారు.
“రైతుల సమస్యలు, పేదల కష్టాలు, రాష్ట్ర అభివృద్ధి… ఇవన్నీ చూసేది కేసీఆర్ ఒక్కరే. ఆయన దూరదృష్టి, అనుభవం, చతురతకు ప్రత్యామ్నాయం లేదు. అందుకే ఆయనను గరళకంటుడని నేను పిలుస్తున్నాను. తెలంగాణ మళ్లీ ఆయనకే బాధ్యత ఇస్తుంది” అని దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు.