
తిరుపతి, అక్టోబర్ 12 (విశ్వం న్యూస్): తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్‌బాబు ఇప్పుడు మరోసారి వివాదాల మధ్య చిక్కుకున్నారు. ఇటీవల కుటుంబ అంతర్గత గొడవలు, పోలీస్ కౌన్సిలింగ్‌లతో వార్తల్లో నిలిచిన మంచు కుటుంబం ఇప్పుడు విద్యా రంగానికి సంబంధించిన అంశంతో చర్చనీయాంశమైంది.
తిరుపతి జిల్లా రంగంపేటలో 2022లో మోహన్‌బాబు స్థాపించిన మోహన్‌బాబు యూనివర్సిటీ (MBU) ప్రస్తుతం ఇంజినీరింగ్, గ్రీన్‌ఫీల్డ్ కోర్సులతో సహా పలు విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో 70 శాతం ఇంజినీరింగ్ సీట్లు, 35 శాతం గ్రీన్‌ఫీల్డ్ సీట్లు ప్రభుత్వ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ కోటా ఫీజులను ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (AP HEC) నిర్ణయిస్తుంది.

అయితే, 2022–23 విద్యా సంవత్సరం నుంచి 2023 సెప్టెంబర్ వరకు యూనివర్సిటీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే రూ.26.17 కోట్లు అదనంగా వసూలు చేసిందని ఆరోపణలు వెలువడ్డాయి. అంతేకాదు, డే స్కాలర్ విద్యార్థుల దగ్గర నుంచే మెస్ ఛార్జీలు వసూలు చేయడం, హాజరు తక్కువగా ఉందని అదనపు ఫీజులు వేయడం వంటి అంశాలు బయటపడ్డాయి. ఈ ఫిర్యాదులపై AP Parents Association చేసిన పిర్యాదుతో HEC ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో యూనివర్సిటీ ఆదాయాన్ని దాచడం, విద్యార్థుల హాజరులో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిపివేయడం వంటి అంశాలు నిర్ధారించబడ్డాయి.
దీంతో కమిషన్ రూ.26.17 కోట్లు 15 రోజుల్లో విద్యార్థులకు తిరిగి చెల్లించాలని, అలాగే గతంలో విధించిన రూ.15 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా, యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE)లకు సిఫారసు చేసింది. విద్యార్థులను తాత్కాలికంగా సమీపంలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధం చేయాలని సూచించింది.
మోహన్‌బాబు యూనివర్సిటీ వర్గాలు విద్యార్థులు స్వచ్ఛందంగా అదనపు ఫీజులు చెల్లించారని పేర్కొన్నాయి. అయితే కమిషన్ ఈ వాదనను తిరస్కరించి, “ఫీజుల వసూలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధం” అని తేల్చింది.
తదనంతరం MBU యాజమాన్యం ఈ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసింది. కోర్టు 26 సెప్టెంబర్ 2024న మూడు వారాల తాత్కాలిక స్టే ఇచ్చి, తదుపరి విచారణను అక్టోబర్ 14, 2025కి వాయిదా వేసింది.