
- సీఎం లు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, సీఎస్ రామకృష్ణారావుకు తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 30 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో బీసీ–ఈ గ్రూప్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో కూడా 4 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, సమైక్య ఆంధ్రప్రదేశ్ కాలంలో ముస్లిం వెనుకబడిన వర్గాలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అందేలా చొరవ తీసుకున్నది అప్పటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లిం వర్గాల విద్యా, ఉపాధి అభివృద్ధికి ఈ రిజర్వేషన్లు ఎంతో దోహదం చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బీసీ–ఈ కేటగిరీలో కొనసాగుతున్న ముస్లిం వర్గాలకు ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు అమలులో ఉన్నప్పటికీ, ప్రమోషన్లలో మాత్రం ఇంకా అమలు చేయకపోవడం బాధాకరమని తెలిపారు.
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు అమలులో ఉన్నట్లే బీసీ–ఈ గ్రూప్‌కు కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అసోసియేషన్ పక్షాన అధికారిక పత్రాలు పంపినట్లు ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
ప్రమోషన్లలో బీసీ–ఈ గ్రూప్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల న్యాయ హక్కుల రక్షణ కోసం అసోసియేషన్ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.