గాజుల రామారం భూకబ్జాలపై దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలు

గాజుల రామారం భూకబ్జాలపై దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్, డిసెంబర్ 18 (విశ్వం న్యూస్) : ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ మాఫియాలా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ చట్టాలను నీరుగార్చి అక్రమ భూకబ్జాలకు అండగా నిలుస్తోందన్నారు.

దేశ గర్వకారణమైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ల్యాండ్ సీలింగ్ చట్టం, అలాగే రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన చట్టాలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ మారిన నాయకులకు నజరానాలుగా వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా బదలాయిస్తున్నారని ఆరోపించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని సర్వే నంబర్ 307లో ల్యాండ్ సీలింగ్ కింద ఉన్న భూములపై అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు. పార్టీ మారిన వెంటనే అరికెపూడి గాంధీకి 11 ఎకరాల భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూ భారతి పోర్టల్‌లో ఎంట్రీలు చేయడం ప్రభుత్వ ప్రమేయం లేకుండా సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ అక్రమాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు లేకపోవడం అనుమానాస్పదమన్నారు. ఐడీపీఎల్ భూములపై విచారణ పేరిట డ్రామా చేస్తూ, గాజుల రామారం సర్వే నంబర్ 307ను విస్మరించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. దమ్ముంటే ఆ ప్రాంతంలోనే విచారణ జరపాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.

ప్రతిపక్ష నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు చెప్పడం తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. అలాగే రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరితో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

బీజేపీ–కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఆరోపించిన దాసోజు శ్రవణ్, పార్టీ పిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *