కులగణన గోప్యత
ఎందుకు? డా. శ్రవణ్ ప్రశ్న

హైదరాబాద్, డిసెంబర్ 20 (విశ్వం న్యూస్) : కోట్లాది మంది బీసీల భవిష్యత్తును ప్రభావితం చేసే కులగణన డేటా, SEEEPC సర్వే నివేదికలను తెలంగాణ ప్రభుత్వం రహస్యంగా ఉంచడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని తెలంగాణ శాసన మండలి సభ్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు తీవ్రంగా విమర్శించారు. శనివారం రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌కు సమగ్రమైన ఫిర్యాదు లేఖను సమర్పించిన ఆయన, “ప్రజల డేటాపై ప్రజలకే హక్కు ఉండాలి” అని స్పష్టం చేశారు.
మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో డాక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ—42 శాతం బీసీ రిజర్వేషన్లపై చట్టాలు చేస్తున్న ప్రభుత్వం, ఆ నిర్ణయాలకు ఆధారమైన SEEEPC (Social, Educational, Economic, Employment, Political and Caste) సర్వే నివేదికలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. డేటా ప్రజలకు తెలియకుండా విధానాలు రూపొందించడం పునాదిలేని భవనంలాంటిదని వ్యాఖ్యానించారు.
RTI చట్టం సెక్షన్–4 ప్రకారం ప్రభుత్వ కీలక నిర్ణయాల వెనుక ఉన్న సమాచారం స్వచ్ఛందంగా ప్రజల ముందుంచాల్సి ఉంటుందని గుర్తు చేసిన ఆయన, ఆ నిబంధనను విస్మరించి ప్రభుత్వం “రహస్య పాలన” సాగిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర సమాచార కమిషన్ తక్షణ జోక్యం అవసరమని స్పష్టం చేశారు.
డిమాండ్లు:
- SEEEPC సర్వేకు సంబంధించిన పూర్తి డేటా, ‘రా’ డేటా, శాస్త్రీయ నివేదికలను ప్రభుత్వ వెబ్సైట్లలో వెంటనే పీడీఎఫ్ రూపంలో ఉంచాలి.
- సామాన్యులకు అర్థమయ్యేలా, డౌన్లోడ్ చేసుకునే మెషిన్–రీడబుల్ ఫార్మాట్లో సమాచారం అందుబాటులో ఉంచాలి.
- 15 నుంచి 30 రోజుల్లోగా వివరాలు బహిర్గతం చేసేలా రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి.
“సమాచారం ప్రజల ఆస్తి. దాన్ని దాచే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే మా పోరాటం” అని డాక్టర్ శ్రవణ్ స్పష్టం చేశారు. ఈ లేఖ ప్రతులను రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డితో పాటు గౌరవ ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులకు కూడా పంపినట్లు ఆయన తెలిపారు.