కబడ్డీ విజేతలకు ఘన సన్మానం

కబడ్డీ విజేతలకు ఘన సన్మానం

నాగారం, డిసెంబర్ 26 (విశ్వం న్యూస్): గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో కరుణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫణిగిరి గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల విజేతలకు బుధవారం రాత్రి ఘనంగా బహుమతి ప్రధానోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫణిగిరి గ్రామ సర్పంచ్ ఎర్ర సావిత్రి యాదగిరి, బీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య హాజరై విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. కబడ్డీ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ నూతనకల్ జట్టు, సెకండ్ ప్రైజ్ మోత్కూర్ జట్టు, థర్డ్ ప్రైజ్ కరుణ యూత్ క్లబ్, ఫోర్త్ ప్రైజ్ ఫణిగిరి జట్టు సాధించాయి.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్ర సావిత్రి యాదగిరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అపార ప్రతిభ గల క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని, కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడల్లో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, యువత చదువుతో పాటు ఆటలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.

బీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ క్రీడాకారులు కష్టపడి సాధన చేస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ నాతి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఉప సర్పంచ్ వల్లాల భాను ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ ఆటల పోటీల్లో గెలుపోటములు సహజమని, రెండింటినీ సమానంగా స్వీకరించాలని సూచించారు.

ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ పోటీలతో గ్రామంలో క్రీడా ఉత్సాహం వెల్లివిరిసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, కబడ్డీ క్రీడాకారులు, అభిమానులు, కరుణ యువజన సంఘం కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *