దివ్యాంగుల హక్కులపై
డా. దాసోజు ఘాటైన స్వరం

హైదరాబాద్, డిసెంబర్ 29 (విశ్వం న్యూస్) : దివ్యాంగుల హక్కుల కోసం శాసన మండలి వేదికగా డాక్టర్ శ్రవణ్ దాసోజు గంభీర స్వరంతో మాట్లాడారు. 2016లో అమల్లోకి వచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం (RPwD Act) కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా అమలు కావాలంటూ ముఖ్యమంత్రిని ఆయన కోరారు.
ఉన్నత విద్యలో 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం శుభారంభమేనని పేర్కొన్న ఆయన, “అది ఆరంభం మాత్రమే. వేలాది కుటుంబాల కన్నీళ్లు తుడవాలంటే ఇంకా చాలా చేయాలి” అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. కనీస హక్కుల కోసం తల్లిదండ్రులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఆటిజం, పక్షవాతం వంటి 21 రకాల వైకల్యాలపై సరైన అవగాహన, ప్రభుత్వ పరీక్షా కేంద్రాల లేమితో పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ సెంటర్ల చేతిలో మోసపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆచరణాత్మక ప్రతిపాదనలు:
ఎల్‌కేజీ నుంచే రిజర్వేషన్లు: ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లలో 5% సీట్లు దివ్యాంగులకు ఉచితంగా కేటాయించాలి.
ప్రభుత్వ థెరపీ సెంటర్లు: ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
పాఠశాలల్లో నిపుణులు: ప్రతి స్కూల్‌లో సైకాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ ఉండాలి.
పూర్తి ఫీజు రాయితీ: దివ్యాంగ విద్యార్థులకు 100% ఫీజు మాఫీ, స్కాలర్‌షిప్స్ కల్పించాలి.
జిల్లా స్థాయి నిఘా: చట్ట అమలుపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి.
“దివ్యాంగులకు అండగా నిలబడటం ఉపకారం కాదు—నాగరిక సమాజంగా మన నైతిక బాధ్యత,” అని డాక్టర్ దాసోజు స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు కలిసి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
“ప్రతి బిడ్డకు గౌరవంగా బతికే హక్కు ఉంది. సమాన అవకాశాలు కల్పించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.