“ముఖ్యమంత్రి పీఠానికి అవమానం రేవంత్ భాష” – ఎంఎల్సీ దాసోజు శ్రవణ్

“ముఖ్యమంత్రి పీఠానికి అవమానం రేవంత్ భాష” – ఎంఎల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 5, 2026 (విశ్వం న్యూస్):ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని వీధి రౌడీ భాష మాట్లాడటం తెలంగాణ సంస్కృతికే అవమానమని శాసనమండలి సభ్యులు డా. దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. అధికార మదంతో సీఎం రేవంత్ రెడ్డి బూతుభాష ప్రయోగిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని విమర్శించారు. 72 ఏళ్ల వయసున్న, రాజ్యాంగ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ ఉద్యమనాయకుడు కేసీఆర్ గారికి కనీస మానవ గౌరవం కూడా ఇవ్వలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని దాసోజు వ్యాఖ్యానించారు. “మనిషిని మనిషిగా గౌరవించలేని నీవు పాలన గురించి మాట్లాడటం విడ్డూరం” అని ఆయన తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు.

ప్రజల సొమ్ముతో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినప్పటికీ, సీఎం నేర్చుకున్నది బూతు భాషేనని ఎద్దేవా చేశారు. “ముఖ్యమంత్రి పదవి గౌరవానికి, బాధ్యతకు ప్రతీక. కానీ ఆ పవిత్రమైన కుర్చీలో కూర్చుని బజారు భాష వాడటం ఆ పదవినే అవమానించడం” అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారిని కుల పరిమితుల్లో బంధించేందుకు ప్రయత్నించడం తెలంగాణ అస్తిత్వంపై దాడేనని, కేవలం ఓట్ల కోసం కుల ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న తీరు క్షమించరాని నేరమని దాసోజు శ్రవణ్ అన్నారు. “నీ కుల అహంకారానికి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారు” అని హెచ్చరించారు.

అవినీతి, పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం బూతు రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించిన దాసోజు, తెలంగాణను అభివృద్ధి రాష్ట్రం నుంచి బూతు రాజకీయాల కేంద్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

“గద్దెనెక్కినంత మాత్రాన గాడిద గుర్రం కాదు” అన్నట్లు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా రేవంత్ రెడ్డి బజారు బుద్ధి మారలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజల తీర్పు తప్పదని, రాజకీయ శిక్ష తప్పదని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *