వేద మంత్రాలపై ఎమ్మెల్యే
సామేల్ తీవ్ర వ్యాఖ్యలు

- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం – సామాజిక వర్గాల్లో చర్చ
హైదరాబాద్, మార్చి 14 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. బ్రాహ్మణులు, వేద మంత్రాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరియు సామాజికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ నెల 12వ తేదీన గాంధీ భవన్లో మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలంగాణ పీసీసీ ఎస్సీ సెల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా కవ్వంపల్లి సత్యనారాయణకు బ్రాహ్మణ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే మందుల సామేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఆదివాసులు, దళితులకు ప్రమాదం పొంచి ఉందని, మనువాద వ్యవస్థ మళ్లీ బలపడుతోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంలో వేద మంత్రాలపై మరియు బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు సభలోనే చర్చకు దారి తీశాయి. ఆయన మాట్లాడిన కొన్ని పదాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలతో అక్కడున్న కొంతమంది నేతలు ఆశ్చర్యానికి గురయ్యారని తెలుస్తోంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. బ్రాహ్మణ సంఘాలు, పండితులు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఎమ్మెల్యే సామేల్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి వర్గాల మధ్య వాదోపవాదాలకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.