ఫంక్షన్లో ఫోటో దిగుతూ
కుప్పకూలింది, వీడియో వైరల్

ఖమ్మం , మార్చి 16 (విశ్వం న్యూస్): ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఫంక్షన్లో ఆనందంగా పాల్గొంటున్న 36 ఏళ్ల మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటన అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత (36) బంధువుల ఇంట్లో జరిగిన గృహప్రవేశ వేడుకకు హాజరైంది. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఎంతో ఆనందంగా కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా అందరూ కలిసి ఫోటోలు దిగుతుండగా, సుస్మిత కూడా ఫోటో కోసం నిలబడింది. తన పక్కన ఉన్నవారితో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ఆమె కుప్పకూలి పడిపోయింది.
అది గమనించిన బంధువులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి చూసే సరికి ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటుతోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. క్షణం ముందు వరకు ఆనందంగా నవ్వుతూ మాట్లాడిన మహిళ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా పురుషుల్లో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మహిళల్లో కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సుస్మిత ఆకస్మిక మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.