డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలి

హుజురాబాద్, ఏప్రిల్ 10 (విశ్వం న్యూస్):సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలని హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు.
హుజురాబాద్ పట్టణంలోని మక్కా మసీద్ ఆవరణంలో నిర్వహించిన ముస్లింల సమావేశంలో ఆయన మాట్లాడారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల వాయు, జల, భూ కాలుష్యాలు పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విషపూరిత వాయువుల కారణంగా ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశముందని, పంటలు పండించేందుకు భూమి అనర్హంగా మారుతుందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల హుజురాబాద్ పరిధిలోని ప్రజల జీవనం ప్రమాదంలో పడుతుందని తెలిపారు.
పచ్చని హుజురాబాద్ ప్రాంతాన్ని నాశనం చేయొద్దని, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తదితరులను డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని కోరారు.
సమావేశంలో మక్కా మసీద్ అధ్యక్షుడు సయ్యద్ అజీమ్, మహమ్మద్ బాసుమియా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ హుదూస్, సయ్యద్ లతీఫ్, సయ్యద్ కుదుస్, సయ్యద్ సాజిత్, సయ్యద్ సలీం, మహమ్మద్ ఇర్ఫాన్, ఖాజ మొయినోద్దీన్, ఇమామ్ మహమ్మద్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.