జిపిఎఫ్ డబ్బులు వెంటనే విడుదల చేయండి — ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం

జిపిఎఫ్ డబ్బులు వెంటనే విడుదల చేయండి — ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్ (General Provident Fund) డబ్బుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతినెల తమ జీతాల నుంచి కోత పెట్టుకుని జిపిఎఫ్ ఖాతాల్లో జమ చేసిన సొమ్మును ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్, నాన్-గజిటెడ్, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ఉద్యోగులు తమ కుటుంబ అవసరాల కోసం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిపిఎఫ్‌లో డబ్బులు దాచుకుంటారని, అలాంటి సొమ్మును ప్రభుత్వం వినియోగించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జిపిఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే టోకెన్లు పొందిన ఉద్యోగులకు వెంటనే వారి సొమ్మును మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, మెడికల్ బిల్లులు, లీవ్ సరెండర్ బిల్లులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

అదనంగా, పెండింగ్‌లో ఉన్న డిఏలు, పిఆర్‌సి అమలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. “మేము దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఎలా వాడుకుంటుందో అర్థం కావడం లేదు. ఇది ఉద్యోగుల హక్కులపై తీవ్ర ఉల్లంఘన” అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి, జిపిఎఫ్ డబ్బులు సహా అన్ని బకాయిలను విడుదల చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశముందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *