‘కుక్క’ బీభత్సం .. సీసీటీవీలో భయానక దృశ్యాలు
‘కుక్క’ బీభత్సం .. సీసీటీవీలో భయానక దృశ్యాలు

విశ్వం న్యూస్/హైదరాబాద్, సెప్టెంబర్ 18:చిన్నారిని ఎత్తుకుని నడకకు తీసుకెళ్తున్న మహిళపై ఓ కుక్క ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో మహిళతో పాటు చిన్నారి కిందపడిపోయారు. అనంతరం కుక్క చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
చిన్నారి పిన్ని బయటకు నడకకు తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అకస్మాత్తుగా పిట్‌బుల్ వారి వైపు పరుగెత్తుకొచ్చి చిన్నారిపై దూసుకెళ్లింది. చిన్నారిని కాపాడేందుకు మహిళ ప్రయత్నించినప్పటికీ, కుక్క చిన్నారిని నోటితో పట్టుకోవడంతో ఆమె చేతుల నుంచి చిన్నారి కిందపడిపోయింది.
అక్కడితో ఆగకుండా కుక్క చిన్నారిని వదలకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. అక్కడున్న పలువురు వ్యక్తులు కుక్కను చిన్నారి నుంచి విడదీయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన చిన్నారిని మెరుగైన చికిత్స కోసం రోహ్తక్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ ఘటనపై చిన్నారి కుటుంబం ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
యజమాని నిర్లక్ష్యంపై ప్రశ్నలు : ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కుక్క యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించారా? పిట్‌బుల్ వంటి కుక్కను ఇంట్లో పెంచేందుకు అవసరమైన నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలోనూ ఢిల్లీలోని వినయ్ ఎన్‌క్లేవ్‌లో ఆరేళ్ల బాలుడిపై పిట్‌బుల్ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దాడిలో బాలుడి కుడి చెవిలో కొంత భాగం తెగిపోవడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కుక్క యజమానిని హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.