తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే సహించేది లేదు.. రాజు బోడాపై మంత్రి శ్రీదేవి ఫైర్!

తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే సహించేది లేదు.. రాజు బోడాపై మంత్రి శ్రీదేవి ఫైర్!

  • మధుప్రియ, శివజ్యోతిల వ్యక్తిత్వ హననంపై తీవ్ర ఆగ్రహం.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఉపేక్షించేది లేదు.. పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపు

విశ్వం న్యూస్, హైదరాబాద్‌, 10 నవంబర్ 2026 : తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదని మంత్రి శ్రీదేవి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో తమ పాట, మాటతో ప్రజల్లో చైతన్యం రగిలించి ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన మధుప్రియ, శివజ్యోతిలపై రాజు బోడా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళల వ్యక్తిత్వాలపై నీలాపనిందలు వేయడం బలహీనుల లక్షణమని, ఇలాంటి చౌకబారు ఆరోపణలతో తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డల గౌరవాన్ని మసకబార్చలేరని స్పష్టం చేశారు.

తమ స్వశక్తితో, అసాధారణ ప్రతిభాపాటవాలతో ఎదిగిన మధుప్రియ, శివజ్యోతిలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ గళాన్ని ఆయుధంగా మలుచుకొని ప్రజల్లో చైతన్యం నింపిన ఈ ఇద్దరు కళాకారిణుల ఉద్యమ ప్రస్థానాన్ని విస్మరించి, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తినే అవమానించడమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆడబిడ్డలపై ఇలాంటి వ్యాఖ్యలను సమాజం ఆమోదించదు : తమకు నచ్చిన విధంగా నడుచుకోవడం లేదని, తమ కోసం పనిచేయడం లేదని మహిళలపై దిగజారి ఆరోపణలు చేయడం క్షమించరానిదని శ్రీదేవి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజం ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రాల్లోని చెడు సంస్కృతిని తెలంగాణలోకి తీసుకురావాలనే ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని అన్నారు.

మధుప్రియ, శివజ్యోతిలపై ఉపయోగించిన పదజాలం తీవ్ర అభ్యంతరకరమని, మహిళల గౌరవాన్ని కించపరిచే వారికి తగిన శిక్ష పడేలా పోరాడాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను తేలిగ్గా తీసుకుంటే భవిష్యత్తులో మరిన్ని అవమానకర వ్యాఖ్యలకు ఆస్కారం ఏర్పడుతుందని హెచ్చరించారు.

ఎవడీ బోడాగాడు.. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించడానికి ఎంత ధైర్యం? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీదేవి, మధుప్రియ, శివజ్యోతిల ఆత్మగౌరవానికి అండగా నిలవాలని, మహిళల గౌరవం కోసం పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *