పుట్టినరోజు కానుకగా విజేతలకు 20వేల రూపాయల క్యాష్ ప్రైజ్

విద్యార్థులకు అందజేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి
వీణవంక, పిబ్రవరి 26 (విశ్వం న్యూస్) : మండలంలోని గన్మకుల మోడల్ స్కూల్లో యప్ టివి సిఇఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని యప్ టివి సిబ్బంది రాజశేఖర్, కుమారస్వామి, రాకేష్ మరియు బ్రైట్ లైఫ్ కోఆర్డినేటర్ తాళ్లపల్లి కుమారస్వామి ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు “సమాజానికి విద్య ప్రాముఖ్యత, ఆవశ్యకత” మరియు “సమాజ సేవలో విద్యార్థుల పాత్ర” అంశాలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన 12 మంది విద్యార్థులకు 20వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ను కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల విజ్ఞానాభివృద్ధికి ఉదయ్ నందన్ రెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ మాట్లాడుతూ తనతో పాటు తన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలని కోరుకునే మానవతావాదులు పాడి ఉదయ్ నందన్ రెడ్డి అన్నారు. భావి భారత పౌరులుగా ఎదిగే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని 200 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నారని, గ్రామీణ విద్యార్థులలో సాంకేతిక జ్ఞానాన్ని పెంపొందించేందుకై మండల కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారని కొనియాడారు. విద్యార్థులకు విజ్ఞానాన్ని మరింత చేరువ చేసేందుకై ట్యురిటో ఛానల్ ద్వారా డిజిటల్ మాధ్యమంలో ప్రసారాలను అందిస్తున్నారన్నారు. పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాలను వెలికి తీసేందుకై ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించి క్యాష్ ప్రైస్ అందించి నూతన ఉరవడికి శ్రీకారం చుట్టారన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉదయ్ నందన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి వారి బాటలో ప్రయాణించి సమాజ హిత కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్టిఎఫ్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.