
- హైదరాబాద్ అభివృద్ధికి మొండిచేయి… బడ్జెట్‌పై దాసోజు శ్రవణ్ విమర్శలు
హైదరాబాద్, మార్చి 20 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెల గారడీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
బడ్జెట్ వంటి అధికారిక పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టేటప్పుడు పారదర్శకత, సహేతుకత, నిజాయితీ ఉండాలని ఆయన అన్నారు. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో ఆ లక్షణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. 69 పేజీల బడ్జెట్ పత్రంలో దాదాపు 39 పేజీలు ప్రభుత్వ స్వప్రశంసలతో నింపబడ్డాయని ఆయన విమర్శించారు.

“Telangana Budget in Brief 2026–27” పుస్తకంలో రెవెన్యూ రిసిప్ట్స్‌కు సంబంధించిన అంకెలు అనుమానాస్పదంగా ఉన్నాయని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి రూ.2,29,720 కోట్ల రెవెన్యూ రిసిప్ట్స్ వస్తాయని ప్రభుత్వం అంచనా వేసిందని, అయితే రివైజ్డ్ అంచనాల్లో రూ.2,03,970 కోట్లుగా చూపించిందని తెలిపారు. ఇదే సమయంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) వెబ్‌సైట్‌లో జనవరి 2026 వరకు రాష్ట్ర రెవెన్యూ రిసిప్ట్స్ కేవలం రూ.1,38,371 కోట్లే ఉన్నట్లు వెల్లడైందని అన్నారు. జనవరి తర్వాత కేవలం 50 రోజుల్లోనే రూ.65 వేల కోట్లకు పైగా రెవెన్యూ వచ్చిందని చెప్పడం ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు ₹4,000 భృతి, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై ప్రభుత్వం మౌనం వహిస్తోందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రానికి ప్రధాన ఆదాయ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదని దాసోజు శ్రవణ్ విమర్శించారు. నగరాభివృద్ధి కోసం కేవలం రూ.17,907 కోట్లే కేటాయించడాన్ని ఆయన ప్రశ్నించారు.
బడ్జెట్‌లో ఉన్న ఈ అంశాలపై శాసనసభలో మరియు శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పోరాడుతుందని, ప్రభుత్వాన్ని నిలదీసి వాస్తవాలను బయటపెడతామని దాసోజు శ్రవణ్ తెలిపారు.