కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

హైదరాబాద్, ఆగస్టు 28 (విశ్వం న్యూస్) : బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. దాదాపు ఐదున్నర నెలల పాటు జైలులో ఉన్న ఆమె బుధవారం స్వరాష్ట్రం చేరుకున్నారు. స్వరాష్ట్రం చేరుకున్న కవితకు పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులతోపాటు ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇంట్లోకి వెళ్లిన అనంతరం కవిత పూజా మందిరంలో పూజలు చేశారు. అనంతరం భర్త అనిల్ కుమార్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం పొందారు. అనంతరం తన సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాఖీ కట్టారు.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో కవిత రాకతో సందడిగా మారింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆమె అభిమానులు పోటెత్తడంతో జూబ్లీహిల్స్ ప్రాంతం గులాబీమయంగా మారింది. కాగా కవితను కలిసేందుకు పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చారు. ఇక కుటుంబసభ్యులందరూ కవిత నివాసానికి చేరుకున్నారు. కేటీఆర్ సతీమణి శైలిమ, వారి పిల్లలు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కుటుంబసభ్యులు, కవిత అత్తమ్మలు (కేసీఆర్ సోదరిమణులు) చేరుకుని కవితను ఆశీర్వదించారు.










కీలక వ్యాఖ్యలు
ఇంటికి చేరుకున్న సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తన విషయంలో న్యాయం గెలుస్తుందని అన్నారు. ‘‘ధర్మం గెలుస్తుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఆ రోజు కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పని చేస్తా. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటాల్లో పాల్గొంటాను. అంతిమంగా అపవాదులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తా అనే విశ్వాసం నాకు ఉంది’’ అని కవిత అన్నారు.