మొయినాబాద్ డ్రగ్స్ ఘటనపై పారదర్శక విచారణ జరపాలి:దాసోజు

హైదరాబాద్, మార్చి 15 (విశ్వం న్యూస్): మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ ఘటనపై పూర్తి స్థాయి, లోతైన మరియు పారదర్శక విచారణ జరపాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా వారు ఏ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు సమానంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఇటీవల జరిగిన విందులో టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారని సమాచారం ఉందన్నారు. ఆ ఫార్మ్‌హౌస్‌లో డ్రగ్స్ దొరికాయని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో నిజానిజాలను పూర్తిగా వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కావాలని బురద జల్లుతోందని ఆయన ఆరోపించారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహవాస దోషంతో కేటీఆర్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని శ్రవణ్ విమర్శించారు. మొయినాబాద్ ఫార్మ్‌హౌస్ ఘటనకు కేటీఆర్‌ను లింకు పెట్టడం తగదని అన్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2025 సంవత్సరంలో రాష్ట్రంలో 2,572 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, గంజాయి వినియోగం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. శాసన మండలిలో తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం 30 శాతం పెరిగిందని ప్రభుత్వం తెలిపిందని గుర్తు చేశారు.
డ్రగ్స్ అంశంపై ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే డ్రగ్స్ టెస్ట్‌కు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని శ్రవణ్ తెలిపారు. గవర్నర్ ప్రసంగం పూర్తయ్యగానే అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా నిలబడి డ్రగ్ టెస్ట్ చేయించుకుందామని ఆయన సవాల్ విసిరారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు.
కేటీఆర్ ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపుతున్నందుకే కాంగ్రెస్ నేతలు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శ్రవణ్ విమర్శించారు. గతంలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై చేసిన ఆరోపణలపై కోర్టు హెచ్చరికలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేసే కాంగ్రెస్ నేతలను కోర్టులోకి లాగుతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, వృద్ధులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన ప్రభుత్వం ప్రజల నుంచి ధన్యవాదాలు ఆశించే స్థితిలో లేదన్నారు.
కేసీఆర్ హయాంలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకున్నామని, ప్రస్తుత ప్రభుత్వం నిజాయితీగా చర్యలు తీసుకుంటే డ్రగ్స్ నియంత్రణలో బీఆర్‌ఎస్ సహకరించడానికి సిద్ధంగా ఉందని శ్రవణ్ తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర చారి కూడా పాల్గొన్నారు.