ఏసీటీఓలకు గజిటెడ్ హోదా వెంటనే కల్పించాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 12, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏసీటీఓలకు గజిటెడ్ హోదా వెంటనే కల్పించి, దానికి సంబంధించిన జీవోను తక్షణమే జారీ చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఎం. రఘునందన్ రావును సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఏసీటీఓలకు గజిటెడ్ హోదా కల్పించడంతో పాటు, ఏసీటీఓలకు డీసీటీఓ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు చేపట్టాలని కోరారు.

అలాగే తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీస్ రూల్స్‌లోని కొత్త నిబంధనలను వెంటనే అమలు చేయాలని, 30:70 ఏసీటీఓ రూల్‌ను సవరించాలని, మల్టీజోన్‌లోని ఏసీటీఓలకు కూడా డీసీటీఓ ప్రమోషన్లు మంజూరు చేయాలని సంఘం విజ్ఞప్తి చేసింది.

వాణిజ్య పన్నుల శాఖలో గతంలో ఎన్నిసార్లు ప్రతినిధులు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని, అయితే ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఎం. రఘునందన్ రావు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తూ చొరవ చూపుతున్నారని సంఘం నాయకులు తెలిపారు. ఉద్యోగ సంఘాలకు సమయం కేటాయిస్తూ సమస్యలను శ్రద్ధగా వింటూ పరిష్కార దిశగా కృషి చేస్తున్న కమిషనర్ రావడం శాఖ ఉద్యోగుల అదృష్టమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర టేబుల్ క్యాలెండర్‌ను కమిషనర్ ఎం. రఘునందన్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై సానుకూల దృక్పథంతో స్పందిస్తున్న కమిషనర్‌కు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.