నాపై చేసిన ఆరోపణలన్నీ
అవాస్తవాలే :అల్లు అర్జున్
- రేవంత్ కు కౌంటర్.. అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్
- అసెంబ్లీ లోనీ వ్యాఖ్యలు బాధించాయి.
హైదరాబాద్, డిసెంబర్ 21 (విశ్వం న్యూస్) : రేవతి అనే మహిళ మరణం బాధకలిగించిందని అర్జున్ చెప్పారు. బాలుడు శ్రీతేజ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఇక, తాను రోడ్ షో చేశానన్న వ్యాఖ్యలను కూడా.. అల్లు అర్జున్ ఖండించారు. అది రోడ్ షో కాదని.. కారు వెళ్తున్న క్రమంలో ఆగిపోయిందని.. దీంతో తాను అభిమానులను పలకరించానని చెప్పారు. ఇది దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. తెలుగు వారి ఖ్యాతిని పెంచేందుకే తాను సినిమాలు చేస్తున్నానని చెప్పారు. సినిమా పెద్ద హిట్టయినా.. తాను 15 రోజులుగా ఇంట్లోనే కూర్చుని బాధపడుతున్నానని తెలిపారు. ప్రజలకు వినోదం పంచాలన్న ఏకైక లక్ష్యంతోనే సినిమాలు చేస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వంతో వివాదాలు తాను కోరుకోవడం లేదని అల్లు అర్జున్ చెప్పారు. ఆ రోజు అనుమతి లేకుండా.. వెళ్లానని అనడం సరికాదని.. తాము పోలీసులకు సమాచారం అందించిన తర్వాతే హాల్ కు వెళ్లానని అర్జున్ వివరించారు. తొక్కిసలాట వ్యవహారం.. తనకు స్పాట్లో తెలియలేదని.. మరుసటి రోజు మాత్రమే తెలిసిందని అర్జున్ చెప్పారు. అయితే.. ఈ విషయంపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు తనను ఎంతో బాధకలిగిస్తున్నాయని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ మీడియా ముందు తనను అప్రతిష్ఠపాల్జేస్తున్నారని అర్జున్ వ్యాఖ్యానించారు.
బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి.. తాను ఆసుపత్రికి వెళ్లి పరామార్శించాలని అనుకున్నట్టు అర్జున్ చెప్పారు. అయితే.. పోలీసులే తనను వద్దని చెప్పారని వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ ఘటన అనుకోకుండా జరిగిందని.. దీనిలో ఎవరి తప్పు లేదన్నారు. తాను ఎవరినీ తప్పుబట్టడం లేదన్నారు.
అసెంబ్లీ లో నాయకులు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని అర్జున్ చెప్పారు. విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని అనుకుని కూడా.. ఈ ఘటన తర్వాత.. వాయిదా వేసుకున్నట్టు అర్జున్ తెలిపారు. పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులే గాయపడితే.. తానుతట్టుకోలేనని.. అలాంటిది తన అభిమానులకు ఏమైనాజరిగితే ఎలా ఉంటానని ప్రశ్నించారు. కాగా, ఈ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అరవింద్, వారి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.