అప్పుల్లో ఆల్‌టైమ్ రికార్డ్ – పరిమితి దాటి 128% అప్పులు చేసిన కాంగ్రెస్ : డా. దాసోజు శ్రవణ్ సంచలన విమర్శలు

  • కాంగ్రెస్ బడ్జెట్ ‘పెద్ద బోగస్’ – CAG రిపోర్టుతో అసలు నిజాలు బయట
  • రూ.2.29 లక్షల కోట్ల బడ్జెట్ పేరే తప్ప.. వాస్తవ ఆదాయం రూ.1.38 లక్షల కోట్లే
  • 100% లక్ష్యాలు.. 60% సాధన – ‘పేపర్ ప్రోస్పరిటీ’గా మారిన కాంగ్రెస్ పాలన
  • రియల్ ఎస్టేట్‌కు రివర్స్ గేర్ – రూ.19 వేల కోట్ల ఆశలు.. రూ.12 వేల కోట్లకే పరిమితం
  • ‘ఫ్యూచర్ సిటీ’ గాలి మాటలే – పెట్టుబడిదారులు తెలంగాణ నుంచి పరార్
  • ఎక్సైజ్ ఆదాయంలో ఘోర వైఫల్యం – లక్ష్యం 27 వేల కోట్లు.. వచ్చిందే 19 వేల కోట్లు
  • ఢిల్లీ యాత్రలు ఫొటో షూట్లకే – 22 వేల కోట్ల గ్రాంట్లకు 4 వేల కోట్లు మాత్రమే
  • అప్పుల్లో ఆల్‌టైమ్ రికార్డ్ – పరిమితి దాటి 128% అప్పులు చేసిన కాంగ్రెస్
  • జీతాలకూ అప్పులే దిక్కు – అభివృద్ధి ఆగి అప్పులు మాత్రమే కుప్పలు
  • బడ్జెట్ వైఫల్యాలపై వెంటనే వైట్ పేపర్ విడుదల చేయాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 22, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ‘కాగితపు సిరి’ మాత్రమేనని, వాస్తవ ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి ప్రజలను మభ్యపెడుతోందని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా విడుదలైన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికతో కాంగ్రెస్ బడ్జెట్ అసలు రంగు బయటపడిందని అన్నారు.

రూ.2.29 లక్షల కోట్ల బడ్జెట్ అని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం వాస్తవంగా సమీకరించిన ఆదాయం కేవలం రూ.1.38 లక్షల కోట్లేనని, ఇది స్పష్టమైన ఆర్థిక మోసమేనని శ్రవణ్ ప్రశ్నించారు. 100 శాతం లక్ష్యాలు అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో కేవలం 60 శాతానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

రియల్ ఎస్టేట్ రంగానికి ‘రివర్స్ గేర్’ పడిందని, రూ.19 వేల కోట్ల ఆదాయం ఆశించి చివరికి రూ.12 వేల కోట్లకే పరిమితమవడం రంగం కుప్పకూలిన నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో చెప్పినవన్నీ గాలి మాటలేనని, పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోతున్నారని ఆరోపించారు.

ఎక్సైజ్ ఆదాయంలోనూ ప్రభుత్వ వైఫల్యం స్పష్టమైందని, రూ.27 వేల కోట్ల లక్ష్యానికి కేవలం రూ.19 వేల కోట్లే రావడం పాలనా అసమర్థతకు అద్దం పడుతోందన్నారు. ఢిల్లీ యాత్రలు ఫొటో షూట్లకే పరిమితమై, రూ.22 వేల కోట్ల గ్రాంట్లు అడిగితే కేవలం రూ.4 వేల కోట్లే రావడం (18 శాతం) కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితిని చూపుతోందని విమర్శించారు.

అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆల్ టైమ్ రికార్డు’ సృష్టించిందని, ఏడాది పరిమితి రూ.54 వేల కోట్లు అయితే జనవరికే రూ.69 వేల కోట్ల అప్పులు చేసి చట్టబద్ధమైన హద్దులను దాటిందన్నారు. జీతాలు చెల్లించేందుకూ అప్పులే దిక్కవడం దారుణమని, అభివృద్ధి ఆగిపోయి అప్పులు మాత్రం కుప్పలవుతున్నాయని మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలు, మూసీ ప్రక్షాళనకు నిధులెక్కడని ప్రశ్నించిన శ్రవణ్, మూసీ ప్రాజెక్టు కేవలం కమీషన్ల కోసమే అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీకి దగ్గరైన పరిస్థితులు నెలకొన్నాయని, అంకెల గారడీతో ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని నిలదీశారు.

తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలని, బడ్జెట్ వైఫల్యాలపై వెంటనే ‘వైట్ పేపర్’ విడుదల చేయాలని డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *