అలుగునూర్ COE ను బాలురకే కేటాయించాలి: టీజీపీఎ రాష్ట్ర కమిటీ కలెక్టర్‌కు వినతి

కరీంనగర్, మే 14 (విశ్వం న్యూస్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్‌లో ఉన్న బాలురు, బాలికల ఉమ్మడి గురుకుల పాఠశాల మరియు కళాశాల (COE) ను బాలురకు కేటాయించాలని టీజీపీఎ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేసారు.
2007లో స్థాపించబడిన ఈ ఉమ్మడి COE విద్యాసంస్థ ఇప్పటివరకు ఉత్తమ ఫలితాలు సాధించిందని, ప్రస్తుతం బాలురు మరియు బాలికలకు వేర్వేరు క్యాంపసులు ఏర్పాటు చేసే పనిలో ఉన్న ప్రభుత్వం ఉత్తర జోన్‌లో బాలురకు ప్రత్యేక COE లేకుండా చేస్తున్న వ్యవస్థపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలుగునూరులో ఉన్న ప్రస్తుత COE ను బాలురకు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ నేతలు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సమస్యపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. బాలురను వేరే చోటుకు మార్చడం కంటే వారిని అక్కడే ఉంచి, చింతకుంట బాలికల పాఠశాలను COE గా మారుస్తూ చర్యలు తీసుకోవాలని టీజీపీఎ నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో టీజీపీఎ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసె పవన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్ దార మధు, విజ్డం ఫండ్ వింగ్ కన్వీనర్ కన్నూరి శ్రీశైలం, సిరిసిల్ల జిల్లా ఇంచార్జి నగునూరి చందు, పేరెంట్స్ కాశిపేట శ్రీకాంత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.